అగ్ర దేశాల ప్రధానుల రాజీనామాలు

Update: 2016-12-05 07:06 GMT
ప్రపంచానికే షాకింగ్ గా చెప్పే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఒకే రోజులో రెండు సంపన్న దేశాలకు చెందిన ప్రధానులు అర్థాంతరంగా తమ పదవులకు రాజీనామాలు చేయటం విస్మయానికి గురి చేయటంతోపాటు.. షాక్ కు గురి చేసినట్లైంది. అనూహ్య పరిణామంగా చెప్పే ఈ ఘటనల్ని చూస్తే.. ఊహించని రీతిలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానులు ఎవరంటే.. ఒకరు న్యూజిలాండ్  ప్రధాని జాన్ కీ కాగా.. మరొకరు ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ.

న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ.. గడిచిన ఎనిమిదేళ్లుగా ఆ పదవిలో ఉన్నారు. మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉన్నట్లుండి ప్రధాని పదవికి రాజీనామా చేస్తుండటం ఎందుకన్న ప్రశ్నకు ఆయనిస్తున్న సమాధానం వింతగా అనిపించక మానదు. తాను రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చేసిందని.. భవిష్యత్తు గురించి తానేం ఆలోచించలేనని చెబుతూ.. కుటుంబ కారణాలతో తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని.. ఇక కుటుంబంతో గడుపుతానని ఆయన వెల్లడించారు.

న్యూజిలాండ్ ప్రధాని తన పదవికి స్వచ్చందంగా రాజీనామా చేయగా.. ఈ పరిణామం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇటలీ ప్రధాని మాటియో రెంజీ  తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగ సవరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయంలో ప్రజలు ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేయటంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా.. రెండు సంపన్న దేశాలకు చెందిన ప్రధానులు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో రాజీనామా చేయటం అనూహ్యంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News