బీజేపీ, టీడీపీలు కలిసి మోసం చేస్తున్నాయి: ఐవీ రెడ్డి

Update: 2017-04-12 10:08 GMT
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీకి గాక మోసానికే కట్టుబడింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని పునరుద్ఘాటిస్తూ నరేంద్రమోడీ ప్రభుత్వం తన మోసపూరిత వైఖరిని చాటుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత - ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆర్థిక సంఘం, జాతీయ అభివ్రుద్ధి మండలి.. వంటి సంస్థలను బూచిగా చూపిస్తూ ఏపీకి ఇచ్చిన హామీ విషయంలో మోడీ సర్కారు మాట తప్పుతోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీలు ఏం చెప్పాయో ప్రత్యేకంగా గుర్తుకు చేయాల్సిన అవసరం లేదు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని, తాము అధికారంలోకి వస్తే ఐదు - పదేళ్లు కాదు.. పదిహేనేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం అని ఆ పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పాయి.  విభజన బిల్లు చర్చ కు వచ్చినప్పుడు రాజ్యసభలో అరుణ్ జైట్లీ  - వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పట్టుబడ్డారు. ఆ విషయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత ప్రకటన కూడా చేయించారు. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే.. తమకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది, విభజన కు గురైన ఆంధ్రప్రదేశ్ హోదాతో అభివ్రుద్ధిలో దూసుకుపోతుందని చెప్పింది బీజేపీ - తెలుగుదేశం నేతలే. మరి ఇప్పుడు మాత్రం ప్రత్యేకహోదా కుదరదు అని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. రాజ్యసభలో కూడా అదే విషయాన్ని ప్రకటించారు. మరీ ఇంత దారుణమా? ఇంతటి కుటిల రాజకీయమా?

ఏ సభలో అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారో.. అదే సభలో అదే పార్టీ వాళ్లు అధికారాన్ని చేతులో పెట్టుకుని ప్రత్యేకహోదా కుదరదని అంటారా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం కాదా? కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు.. ఇది ఈ వ్యవస్థకే అవమానం. ఏపీకి ప్రత్యేకహోదాను ఇస్తామని రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రకటిస్తే.. ఆ ప్రకటనను అపహాస్యం చేయడం.. ప్రజా స్వామ్యాన్ని అవమానించడమే...’ అని ఐవీ రెడ్డి పేర్కొన్నారు.

ఇదే సందర్భంగా తెలుగుదేశం నేతల తీరును కూడా దుయ్యబట్టారాయన. ఎన్నికల ముందు ప్రత్యేకహోదా తో ఏపీ స్వర్గతుల్యం అయిపోతుందని తెలుగుదేశం అధినేత అన్నాడని,ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది? అని ఆయన అంటున్నారని.. బాబులాంటి నిస్సిగ్గు రాజకీయ నేత మరెక్కడా ఉండడని ఐవీ రెడ్డి విరుచుకుపడ్డారు. ‘తెలుగుదేశం పార్టీది సిగ్గుమాలిన తనం. ప్రత్యేకహోదాపై రాజ్యసభలో పాల్గొన్న చర్చలో కూడా ఆ పార్టీ పాల్గొనలేదంటే.. ఏపీ ప్రజలపై ఆ పార్టీకి ఉన్న గౌరవం ఏమిటో.. రాష్ట్ర అభివ్రుద్ధిపై ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ ఏమిటో స్పష్టంగా అర్థం అవుతోంది. అధికారంల చేతిలో ఉంది.. ఎవరూ ఏం చేయలేరనే కండకావరం కొద్దీ తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే ఎన్నికల ముందు తెలుగుదేశం తీరు ఎలా ఉండిందో, ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఎలా మారిందో.. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు, మోసపూరిత వైఖరికి తగిన బుద్ధి చెప్పే సమయం మరెంతో దూరం లేదు..’ అని ఐవీ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుర్తు చేశారు.

ఏపీ అభివఈద్ధికి మొదటి శత్రువు చంద్రబాబే అని ఐవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన కొనుగోలు రాజకీయాలతో తెలంగాణలో ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కోవడం, ఆ కేసు విచారణలో ఉండటంతో బాబు జుట్టు బీజేపీ చేతుల్లో ఉందని, అందుకే బాబు దేన్నీ గట్టిగా డిమాండ్ చేసే స్థితిలో లేడని, కేంద్రం ముందు సాగిలపడిపోతున్నాడని ఐవీ రెడ్డి పేర్కొన్నారు. ‘ఇప్పటికైనా మించి పోయింది లేదు బాబూ.. పోరాడితేనే ఏదైనా దక్కుతుంది. తెలంగాణ రాదని పార్లమెంటులో అనేక సార్లు ప్రకటించారు. అయితే తెలంగాణ రాజకీయ నేతలు, ప్రజలు దాన్ని పోరాడి సాధించుకున్నారు. ప్రత్యేక హోదా కూడా అంతే. ఎవరో రాదని చెప్పినంత మాత్రానా పోరాటాన్ని ఆపేది లేదు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. ప్రజల అండదండలతో వారి ఆకాంక్షమేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుంది. తెలుగుదేశం కూడా ఈ పోరాటానికి రావాలి. అధికార దాహంతో గాక.. ప్రజల కోసం కొంచెమైన చేయాలి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రత్యేకహోదాపై పోరాడాలి. అలా కాదని.. అధికారమే పరమావధి ప్రజా ప్రయోజనాలతో పని లేదని అనుకుంటే.. చంద్రబాబును ప్రజలే ఛీ కొడతారు...’ అని ఐవీ రెడ్డి హెచ్చరించారు.

-ఐవీ రెడ్డి,

గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా
Tags:    

Similar News