అరిష్టం, అరాచ‌కం, అవినీతిః ఐవీ రెడ్డి!

Update: 2017-01-27 10:18 GMT
టీడీపీ అధినేత - ఏపీ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని తెలుగుదేశం పార్టీ ప‌రిపాల‌న అరిష్టం - అరాచ‌కం - అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ గా మారింద‌ని వైసీపీ యువ‌నేత ఐవీ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. క‌రువు, కాటకాల‌తో అరిష్టం - అధికారం చేతుల్లో ఉంద‌ని మౌనంగా తెలిపే నిర‌స‌న‌ను అడ్డుకోవ‌డం, ప్ర‌తిప‌క్ష నేత‌ను గౌర‌వం లేకుండా చేయ‌డం అరాచ‌కానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని, ప్రాజెక్టులు మొద‌లుకొని ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల వ‌ర‌కు అంతటా అవినీతిమ‌యం అయిపోయింద‌ని మండిప‌డ్డారు. త‌న వారసుడు లోకేష్ కేంద్రంగా మంత్రుల‌ను అడ్డుపెట్టుకొని సీఎం చంద్ర‌బాబు అడ్డ‌గోలు సంపాద‌న‌కు తెరలేపార‌ని ఐవీ రెడ్డి విమ‌ర్శించారు.

త‌న‌ను గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం అజెండాగా ప‌రిపాల‌న‌ను ముందుకు తీసుకుపోతాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు సీఎం అయిన త‌ర్వాత‌ ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఐవీ రెడ్డి ఆక్షేపించారు. ఒక‌నాడు ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌త్యేక హోదా అంశంపై గ‌ళం విప్పి 10 ఏళ్ల పాటు స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వాల్సిందే అని నిన‌దించిన బాబు ఇపుడు అదే హోదా డిమాండ్‌ ను బ‌ల‌వంతంగా అణిచివేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడి సాధించాల్సిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాజీప‌డిన సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తే వారిని ఎక్క‌డికక్క‌డ నిలువ‌రించ‌డం ద్వారా త‌న‌ మార్కు పాల‌న ఎలా ఉంటుందో మ‌రోమారు గుర్తు చేశార‌ని  పేర్కొన్నారు. రాష్ట్రంలో స‌రైన ఉపాధి లేక ప్ర‌జ‌లు అల్లాడుతుంటే బాబుకు ప‌ట్టింపు లేద‌ని ఐవీ రెడ్డి మండిప‌డ్డారు. నిరుద్యోగులు - యువ‌త ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నార‌ని పేర్కొన్నారు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేసుకున్న చంద్ర‌బాబు ఆచ‌ర‌ణ‌లో దాన్ని ఎందుకు నిలుపుకోవ‌డం లేద‌ని ఐవీ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. ఇక‌నైనా ఆశ్రిత ప‌క్ష‌పాతం ప‌క్క‌న‌పెట్టి రాష్ట్ర అభివృద్దికి ముందుకు సాగాల‌ని కోరారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News