బాబు కుట్రలపై అప్రమత్తం కావాలి : ఐవి రెడ్డి

Update: 2017-11-09 17:45 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు వెల్లువెత్తుతున్న అనూహ్యమైన ప్రజాస్పందనను చూసి.. చంద్రబాబునాయుడు వెన్నులో చలి పుడుతోందని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి ఐవి రెడ్డి అన్నారు. జగన్ కు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారని, ఏదో ఒక రకంగా జగన్ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మీద అర్థంలేని ఆరోపణలు చేస్తూ.. ప్రజల్లో ఒక దురభిప్రాయాన్ని కలిగించడానికి ఆయన తన పార్టీ నాయకులను పురమాయిస్తూ.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఐవిరెడ్డి ఆరోపించారు.

గిద్దలూరులో విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతకు బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకాన్ని తప్పదోవ పట్టించడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుండడాన్ని ఆయన నిందించారు. అయితే ఇలాంటి పెడపోకడలను తొలినుంచి గమనిస్తూనే ఉన్న ప్రజలు మాత్రం.. జగన్మోహన్  రెడ్డికి అకుంఠితమైన మద్దతు ప్రకటిస్తున్నారని ఐవిరెడ్డి అభిప్రాయపడ్డారు.

జగన్ యాత్రలో సుదూర ప్రాంతాలనుంచి ప్రజలు కాలినడకన, బళ్లు కట్టుకుని మరీ ఆయన కార్యక్రమాలకు హాజరై తమ మద్దతును తెలియజేస్తున్న తీరు, తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి.. తెదేపా పాలన పడుతున్న కష్టాలను నివేదించుకుంటున్న తీరు గమనిస్తే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం కలుగుతోందని ఐవిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పన్నాగాలను ప్రజలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఐవిరెడ్డి పిలుపు ఇచ్చారు. జగన్ యాత్ర నేపథ్యంలో కొత్త హామీలు ఇవ్వడానికి తెగిస్తారని, అయితే ప్రజలు అలాంటి బూటకపు హామీల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఐవిరెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News