ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోకి కొత్త పేరు!

Update: 2019-01-16 09:35 GMT
ఆర్థికంగా అత్యంత ప‌వ‌ర్ ఫుల్ పొజిష‌న్ గా చెప్పుకునే ప్ర‌పంచ బ్యాంకు అధ్యక్ష ప‌ద‌వి రేసులోకి మ‌న‌మ్మాయి వ‌చ్చేశారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్ట్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రేసులోకి వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. తాజాగా ఆమె స్థానంలో భార‌త సంత‌తి మ‌హిళ క‌మ్ పెప్సీకో సీఈవో వ్య‌వ‌హ‌రించిన ఇంద్రా నూయి పేరు తెర మీద‌కు వ‌చ్చింది.

అగ్ర‌రాజ్యం అమెరికా ప్ర‌తిపాదించిన వారికే ప్ర‌పంచ బ్యాంకు ప‌గ్గాలు చేజిక్కే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న జిమ్ యాంగ్ కిమ్ త‌న ప‌ద‌వికి వ‌చ్చే నెల (ఫిబ్ర‌వ‌రి 1)లో ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ వ్య‌వ‌ధిలోనే కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయ‌నున్నారు.  

ఇవాంక పేరును తెర మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. తాజాగా ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షురాలిగా ఇంద్రానూయి పేరును ట్రంప్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌ట‌మే కాదు.. అధికారికంగా నామినేట్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అమెరికా క‌నుస‌న్న‌ల్లో ప‌ని చేసే ప్ర‌పంచ బ్యాంకు ప‌గ్గాలు.. ఆ దేశం నామినేట్ చేసిన వారికే స‌హ‌జంగా ద‌క్కుతుంది. మిగిలిన దేశాలు కూడా అమెరికా నిర్ణ‌యాన్ని పాటిస్తూ ఉంటాయి.

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంతురాలైన మ‌హిళ‌ల్లో ఇంద్రానూయికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆమె శ‌క్తిని ట్రంప్‌.. ఇవాంకాలు ప‌లుమార్లు ఇప్ప‌టికే పొగిడేశారు. ఈ నేప‌థ్యంలో ఇంద్రానూయికి ప్ర‌పంచ బ్యాంకు ప‌గ్గాలు ద‌క్కే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది. అదే.. జ‌రిగిన ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన భార‌తీయ మూలాలున్న మొద‌టి వ్య‌క్తిగా ఇంద్రానూయి రికార్డు సృష్టించే వీలుంది.


Tags:    

Similar News