ఇలా అడిగితే అసలు తరలింపు అసాధ్యం!

Update: 2015-11-06 04:16 GMT
సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ కృష్ణారావు విజయవాడలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న తరువాత.. ఇక శాఖల ఉద్యోగులకు మాత్రం హైదరాబాదులో ఏం పని ఉంటుంది. నిజానికి అందరూ అక్కడకు వెళ్లాల్సిందే. చంద్రబాబునాయుడు కూడా అదే కోరుతున్నారు. కానీ ఉద్యోగులు రకరకాల కోర్కెలతో ప్రభుత్వంతో దాగుడుమూతలు ఆడుతున్నారు. అయితే.. ప్రభుత్వాదేశాల ప్రకారం పనిస్థలంలో ఉండాల్సిన ఉద్యోగులు ఇలా కండిషన్లు పెట్టడం చిత్రమైన పరిణామమే. ఉద్యోగుల పట్ల చంద్రబాబు ఇలా మెతగ్గా వ్యవహరిస్తూ ఉంటే అసలు వారిని తరలించడం సాధ్యమేనా అనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఇదేదో రాజకీయంగా వినిపిస్తున్న డిమాండ్‌ ఎంతమాత్రమూ కాదు. సాక్షాత్తూ ప్రభుత్వం లోని ఉన్నతాధికారులే అలా వ్యాఖ్యానిస్తున్నారట. చీఫ్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు ప్రభుత్వ శాఖల తరలింపునకు సంబంధించి హైదరాబాదు సెక్రటేరియేట్‌ లో నిర్వహించిన ఒక సమావేశంలో.. వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన మాట ఇది.

ఆప్షన్లు ఇచ్చి.. మీరెప్పుడొస్తారో చెప్పండి అంటూ అడుగుతూ ఉంటే అసలు ఈ తరలింపు అనేది సాధ్యమయ్యేదేనా అని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఇలా శాఖకు కొందరిని తరలించుకుంటూ పోదాం అనుకుంటే.. ఎప్పటికీ పూర్తి కాదని తరలింపు అనేది ఇలా ఉద్యోగులను విడతలుగా పంపడం కాకుండా.. శాఖల పరంగా ఉండాలని.. ఒక్కొక్క శాఖను పూర్తిస్థాయిలో తరలించడం అనేది జరిగితేనే పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురవకుండా జాప్యం జరగకుండా ఉంటుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారుట.

సెక్రటేరియేట్‌ ను విజయవాడకు తరలించడం గురించి ఇక్కడ ఉన్న శాఖల ఉన్నతాధికారులతో చీఫ్‌ సెక్రటరీ ఓ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అడుగుతున్నంత వరకూ ఉద్యోగులు ఎన్ని రకాల శషబిషలైనా పోతుంటారని, వాటిని ఖాతరు చేస్తూ ఉంటే ఎప్పటికీ తరలింపు పూర్తి కాదని అధికారులు అంటున్నారట. ప్రభుత్వం మరీ మెతగ్గా వ్యవహరించరాదని అంటున్నారట. అయితే.. విడతలుగా ఉద్యోగుల్ని తరలించడం కాకుండా.. ప్రభుత్వ అవసరాల్ని బట్టి ముఖ్యమైన ఒక్కొక్క శాఖను తరలించడం ప్రారంభిస్తే.. పని పరంగా సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారుట.

 నిజమే మరి.. చంద్రబాబు.. తన గురించి ఉద్యోగులు చెడుగా అనుకోకూడదనే ఉద్దేశంతో మెతగ్గా పోతోంటే.. ప్రజలకు ఉపయోగమైన కార్యాలయాల తరలింపు జాప్యం అయిపోతోంది. అని ప్రజలు కూడా భావిస్తున్నారు.
Tags:    

Similar News