200 కోట్ల దోపిడీ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పింకీ ఇరానీ కలిపి విచారణ

Update: 2022-09-14 07:33 GMT
తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ కేసు మరోసారి మలుపు తిరిగింది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) విచారణలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన 200 కోట్ల దోపిడీ, చీటింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బుధవారం విచారణలో పాల్గొనే అవకాశం ఉంది.  పోలీసుల అభ్యర్థనపై ఇంతకుముందు ఆమె రావడానికి సమయం కోరింది. తాజాగా ఈ రోజు విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

జాక్వలిన్ ఫెర్నాండెజ్ సహచరుడు పింకీ ఇరానీని కూడా విచారణలో పాల్గొనాలని సమన్లు పంపారు. ఇద్దరినీ కలిసి అధికారులు విచారించే అవకాశం ఉంది. నటికి అడిగే ప్రశ్నాపత్రం యొక్క సుదీర్ఘ జాబితాను వారు సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. "మేము  చంద్రశేఖర్‌తో ఉన్న సంబంధం గురించి జాక్వాలిన్  ను ప్రశ్నిస్తాం. ఈ సుఖేష్  నుండి ఆమె అందుకున్న బహుమతులు, డబ్బు గురించి అడుగుతాము.  ఇరానీ మరియు ఫెర్నాండెజ్‌లను దీనిపైనే ప్రశ్నిస్తాం" అని అధికార వర్గాలు తెలిపాయి. రెండు, మూడు రోజుల పాటు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరానీ, ఫెర్నాండెజ్‌లను అడిగే ప్రశ్నలతో ఇన్నాళ్లు సుఖేష్ చంద్రశేఖర్ చెబుతున్న అబద్దాలు బయటపడి నిజాలు నిగ్గుతేల్చాలని ఉన్నతాధికారులు  రంగం సిద్ధం చేస్తున్నారు.
 
సెప్టెంబర్ మొదటి వారంలో అధికారులు ఈ విషయంలో మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌తో సహా కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులను మోసం చేసి డబ్బు వసూలు చేసినందుకు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పలువురు బాలీవుడ్ నటులు, మోడల్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. గత ఏడాది ఏప్రిల్‌లో, 2017 ఎన్నికల కమిషన్ లంచం కేసుతో ముడిపడి ఉన్న మరో మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు, ఇందులో మాజీ అన్నాడీఎంకే నాయకుడితోపాటు ఇతరులకు కూడా సంబంధం ఉందని ఆరోపించారు.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేష్ గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో శిక్షఅనుభవిస్తున్నారు. ప్రస్తుతం అదే జైలులో అతడి భార్య లీనా ఖైదీగా ఉన్నారు.

సుఖేష్ పై 200 కోట్ల కుంభకోణం ఆరోపణలున్నాయి. ప్రముఖ బిజినెస్ మ్యాన్ శివేందర్ సింగ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ సుకేష్ తో జాక్వెలిన్ ఫొటో బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. సుఖేష్ చంద్రశేఖర్ మధ్యంతర బెయిల్ పైనా విడుదలైన సమయంలో ఏప్రిల్-జూన్ కాలంలో ఈ ఫొటో తీసినట్లు చెబుతున్నారు.  

జాక్వెలిన్ ను సుకేష్ చెన్నైలో దాదాపు 4 సార్లు కలిశాడని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అతడిని కలిసేందుకు జాక్వెలిన్ ప్రైవేట్ జెట్ ను కూడా ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News