కోదండ పార్టీ కాగిత‌పు ప‌డ‌వ !

Update: 2018-02-27 05:46 GMT
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాం పార్టీ ఏర్పాటుపై అధికార టీఆర్ ఎస్ పార్టీ అప్పుడే ఎదురుదాడి మొద‌లుపెట్టింది. ఓవైపు జేఏసీ చైర్మ‌న్ త‌న పార్టీ ఏర్పాటు కోసం వేగంగా స‌న్నాహాలు చేస్తూ ముందుకు సాగుతుండ‌గా...మ‌రోవైపు ఇంకా బ‌రిలోకి దిగ‌క‌ముందే ఆ పార్టీ భ‌విష్య‌త్‌ను అధికార పార్టీ నేత‌లు తోసిపారేస్తున్నారు. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌న్నిహితుడ‌నే పేరున్న రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జీ జగదీశ్‌ రెడ్డి జేఏసీ చైర్మ‌న్ పార్టీని తేలిక‌గా తీసివేశారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవ అని - ఆ పడవలో ప్రయాణం చేయలేకనే కాంగ్రెస్‌ నేతలు పక్క పార్టీ లోకి వస్తున్నారని చెప్పారు. తెలంగాణపై ఆ పార్టీకి ప్రేమ లేదన్నారు. కోదండ‌రాం పార్టీ కాగితపు పడవ లాంటిదని దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించాలన్న అంశంపై.. బస్సుయాత్రలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ అధిష్ఠానం తమ వైఖరేమిటో చెప్పాలని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే.. పోలవరానికి జాతీయహోదా ఇస్తామంటూ.. జైరాంరమేశ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత‌లు ఉత్తమ్‌కుమార్, జానారెడ్డి సమాధానం చెప్పాలని కోరారు.సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్రలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి ఇదే చివరియాత్ర అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదని.. టీఆర్‌ ఎస్ - మజ్లిస్ పార్టీలు మాత్రమే అసెంబ్లీలో ఉంటాయని చెప్పారు. కోదండరాం పార్టీ కాగితపు పడవలాంటిదని, అందులో చేరాలని ఎవరూ అనుకోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవని.. అందులో ప్రయాణం చేయలేకనే కాంగ్రెస్ నేతలు పక్క పార్టీలోకి వస్తున్నారని మంత్రి ఎద్దేవాచేశారు.

మంచి నావికుడిలా సీఎం కేసీఆర్ నడుపుతున్న పడవను వదిలి.. ఇతర పార్టీల్లో చేరే దుస్థితిలో టీఆర్‌ ఎస్ ప్రజాప్రతినిధులు లేరని త‌మ పార్టీ నుంచి ప‌లువురు  జంప్ చేయ‌నున్నారనే వ్యాఖ్య‌లపై స్పందించారు. బీజేపీ నేతలకు రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని తెలుసు కాబట్టే రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇస్తున్నారని.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడంలేదని ఆయ‌న సూటిగా ప్రశ్నించారు.
Tags:    

Similar News