కోమటిరెడ్డికి కాలిపోయే కౌంటర్ వేశాడు

Update: 2016-03-17 04:55 GMT
మొహమాటాలు వదిలేసి.. నువ్వెంత? అంటే నువ్వెంత? అనే రోజులివి. మామూలోళ్ల పరిస్థితే ఇలా ఉంటే రాజకీయాల్లో ఉండే నేతల మధ్య మాటలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన గొప్పలు చెప్పుకునే క్రమంలో.. తెలంగాణ అధికారపక్షం నుంచి తనకు ఆఫర్ వచ్చినా తాను లైట్ తీసుకున్నానని చెప్పుకోవటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నేత.. రాష్ట్ర మంత్రి.. కోమటిరెడ్డి అంటే అస్సలు పడని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

కోమటిరెడ్డి.. ఆయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డిలు తమ పార్టీలో చేరేందుకు ఏడాది క్రితమే అప్లికేషన్ పెట్టుకున్నారని.. వారిని చేర్చుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఏడాది క్రితమే వారిద్దరూ అప్లికేషన్ పెట్టుకున్నా.. తాము ఒప్పుకోలేదని.. అప్లికేషన్ ను రిజెక్ట్ చేసినట్లుగా ఆయన చెప్పుకున్నారు. 2020 వరకు వారిని పార్టీలోకి రానిచ్చే అవకాశం లేదని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించటం గమనార్హం.

తమకు తెలంగాణ అధికారపక్షం నుంచి ఆఫర్ వచ్చినట్లుగా కోమటిరెడ్డి గొప్పలు చెప్పుకుంటే.. దానికి చెక్ చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు సరిపోవటం ఖాయం. అయితే ఒక్క విషయంలోనే జగదీశ్ రెడ్డి మాటలకు కాస్త తేడా కొట్టటం కనిపిస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ అప్లికేషన్ రిజెక్ట్ అయినప్పుడు.. మళ్లీ పార్టీలో చేర్చుకునే విషయంపై 2020 వరకు అవకాశం లేదని చెప్పటం అంటే..? ఆ తర్వాత అవకాశం ఉందనా? లేక.. మరింకేమైనా ఉందా.? ఏమైనా జగదీశ్ రెడ్డి మాటలు.. కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంటపుట్టించటం ఖాయమనే చెప్పాలి.
Tags:    

Similar News