అమ్మ ఒడిలో 52,463 మందికే కోత‌.. నిజం చెప్పిన జ‌గ‌న్ ప‌త్రిక‌!

Update: 2022-06-24 04:13 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఏటా రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జ‌గ‌న‌న్న అమ్మ ఒడి కింద‌ నగదు జమ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే రెండేళ్ల పాటు ఈ పథకాన్ని ప్రభుత్వం అందజేసింది. ఈ నేప‌థ్యంలో జూన్ 27న‌ అమ్మ ఒడి పథకం మూడో విడత నిధుల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

జూన్ 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అమ్మఒడి పథకం నిధులను విడుదల చేయనున్నారు. వాస్త‌వానికి జూన్ 23వ తేదీనే న‌గ‌దు జ‌మ చేయాల్సి ఉండ‌గా వివిధ కారణాల వల్ల ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో ఈ ఏడాది రూ. 13 వేలను మాత్ర‌మే ప్రభుత్వం జమ చేయనుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌థ‌కం కింద అందించే 15 వేల రూపాయ‌ల్లో 1000 రూపాయ‌లు పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌కు, మ‌రో 1000 మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌కు మిన‌హాయించి 13 వేల రూపాయ‌లే ఇస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా ఈ ఏడాది 1.29 ల‌క్ష‌ల మందికి వివిధ కార‌ణాల‌తో అమ్మ ఒడిని నిలిపివేశార‌ని జూన్ 23న ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే 1.29 ల‌క్ష‌ల మందికి అమ్మ ఒడిని నిలిపివేయ‌లేద‌ని.. కేవ‌లం 52,463 మందికి మాత్ర‌మే అమ్మ ఒడిని నిలిపి వేశార‌ని సాక్షి దిన‌ప‌త్రిక జూన్ 24న ఒక క‌థ‌నం ప్ర‌చురించింది. గ‌తేడాది 44,48,865 మందికి అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అందించ‌గా.. ఈ ఏడాది ఇందులో 52,463 మంది త‌గ్గార‌ని సాక్షి త‌న క‌థ‌నంలో తెలిపింది.

75 శాతం కంటే హాజ‌రు త‌క్కువ ఉండ‌టం వ‌ల్లే ఈ 52,463 మందికి అమ్మ ఒడి అంద‌డం లేద‌ని సాక్షి క‌థ‌నం వివ‌రించింది. గ‌తేడాదితో పోల్చితే ఈ ఏడాది ప‌థ‌కం అంద‌నివారి శాతం కేవ‌లం 1.2 శాతం మాత్ర‌మేన‌ని వెల్ల‌డించింది.

ఈనాడు ప‌త్రిక అమ్మ ఒడిపై త‌ప్పుడు క‌థ‌నాలు రాసింద‌ని సాక్షి మండిప‌డింది. అమ్మ ఒడికి సంబంధించి తుది జాబితాలు ఇంకా ఖ‌రారు కాక‌ముందే ఈనాడు ప‌త్రిక 1.29 ల‌క్ష‌ల మందికి కోత అంటూ త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించింద‌ని పేర్కొంది. వాస్త‌వాల‌ను దాచిపెట్టి.. మ‌రో ల‌క్ష‌న్న‌ర మంది త‌ల్లుల ఈ-కేవైసీ పెండింగ్ అంటూ అస‌త్య క‌థ‌నాలు రాసింద‌ని సాక్షి ప‌త్రిక విమ‌ర్శించింది.

అలాగే అమ్మ ఒడి కింద అందించే రూ.15 వేలల్లో స్కూళ్లలోని ఇత‌ర ప‌రిక‌రాలు, మ‌ర‌మ్మ‌తుల‌ నిర్వ‌హ‌ణ‌కు రూ.1000, మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌కు మ‌రో రూ.1000 మిన‌హాయిస్తున్నార‌ని సాక్షి త‌న క‌థ‌నంలో పేర్కొంది. అది కాకుండా త‌ల్లిదండ్రులు ఇష్ట‌పూర్వ‌కంగానే ఒప్పుకున్నార‌ని సాక్షి చెబుతోంది. దీనివ‌ల్ల 32 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ విద్యార్థుల‌కు మేలు చేకూరుతుంద‌ని సాక్షి త‌న క‌థ‌నంలో వివ‌రించింది.
Tags:    

Similar News