హోదా నాట‌కం అయిపోయింది క‌దా! ఎందుక‌ని త‌వ్వుతారు?

Update: 2022-06-24 09:30 GMT
25 ఎంపీల‌ను ఇస్తే ప్ర‌త్యేక హోదాను తెస్తామ‌ని ఆ రోజు వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన మాట‌ను మ‌రిచిపోవాలిక. ఎందుకంటే రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో హోదా విష‌యం అన్న‌ది అస్స‌లు ప్ర‌స్తావ‌నకే రావ‌డం లేదు. క‌నుక రాష్ట్రం ఇక‌పై హోదా కు సంబంధించి ఏమీ మాట్లాడ‌కూడ‌దు. అన్న విధంగానే ఉంది బీజేపీ. పోనీ బీజేపీని ఇర‌కాటంలో పెట్టేందుకు వైసీపీ ఏమ‌యినా ప్ర‌య‌త్నాలు చేస్తుందా అంటే అదీ లేదు. ఈ త‌రుణాన ఎటువంటి హామీలు లేకుండానే అత్యంత శ‌క్తిమంతం అయిన వైసీపీ మ‌ద్దతును సునాయాసంగానే పొందుతోంది బీజేపీ. ఈ ఎన్నిక‌లు అన్న‌వి బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కం కావ‌డంతో ఆ పార్టీ పరువును కాపాడే ప్ర‌య‌త్నాల్లో వైసీపీతో స‌హా ఇత‌ర ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

"హోదా కోసం ప‌ట్టుబ‌ట్టే  స‌మ‌యం ఇక అయిపోయింద‌నే భావించాలి ? లేదంటే ఇక‌పై ఈ విష‌యం గురించి చ‌ర్చించ‌డం అయినా మానుకోవాలి. ఎందుకంటే హోదా వ‌చ్చే అవ‌కాశాలున్న ప్ర‌తిసారీ వాటిని కాద‌నుకుని వైసీపీ వెళ్తోంది" అన్న‌ది టీడీపీ ఆరోప‌ణ. కేవ‌లం వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే రాష్ట్రం హ‌క్కుల‌ను తాక‌ట్టు పెడుతున్నార‌ని క‌మ్యూనిస్టులు సైతం మండి ప‌డుతున్నారు. అయినా ఇప్పుడు హోదా ఓ ముగిసిన అధ్యాయం అని తాము భావించ‌బోమ‌ని, వీలున్న‌త వ‌ర‌కూ పోరాడుతూనే ఉంటామ‌ని విప‌క్షం త‌న గ‌ళం వినిపిస్తోంది.

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుపై సందేహాలు ఉన్నాయి. ప్ర‌త్యేక హోదా వ‌స్తుందో రాదో అన్న  సంశ‌యం ఉంది. వీటితో పాటు ప‌న్నుల వాటాల చెల్లింపుల్లో వివ‌క్ష ఉంది. ఇవేవీ మాట్లాడ‌కుండా ఎలా ఉంటోంది వైసీపీ..అని అడుగుతోంది టీడీపీ. గ‌తం లో క‌న్నా బ‌ల‌మ‌యిన వాయిస్ ను వినిపించేందుకు అధిక శాతం శ‌క్తి మ‌రియు సామ‌ర్థ్యం ఉన్న పార్టీలు ఈ విధంగా హ‌క్కులు తాక‌ట్టు పెట్టి మ‌రీ ! ఏక ప‌క్ష వాద‌న‌లు వినిపించ‌డం అన్న‌ది బాలేద‌ని కూడా అంటోంది.

ప్ర‌త్యేక హోదా కోసం ప‌ట్టుబ‌ట్టాకే బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కూడా సూచిస్తోంది. కానీ స్వ‌తంత్ర భార‌తావ‌నిలో తొలిసారి ఓ గిరిజ‌న మ‌హిళ‌కు ఇటువంటి అరుదైన గౌర‌వం ద‌క్క‌డంతో రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌దీ ముర్మూకు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని అంటున్న‌ది వైసీపీ. మరి ప్రత్యేక హోదా వస్తే ఏపీలో ఉన్న అందరితో పాటు గిరిజనులు కూడా బాగుపడతారు అని ఎందుకు వైసీపీ గ్రహించలేకపోతోంది అంటోంది టీడీపీ?

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యాన వైసీపీ స్టాండ్ ఏంట‌న్న‌ది తేలిపోయింది. ద్రౌప‌దీ ముర్మూ (బీజేపీ కూట‌మి బ‌ల‌ప‌ర్చిన లేదా ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థి) కే త‌మ మద్ద‌తు అని తేల్చేసింది వైసీపీ. ఇదే స‌మ‌యంలో ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే, ఎటువంటి ప్ర‌తిపాద‌న‌లనూ తెర‌పైకి తీసుకు రాకుండానే ఏ విధంగా బీజేపీకి మ‌ద్ద‌తు  ఇస్తార‌ని ప్ర‌ధాన విప‌క్షం వాదిస్తోంది.

ప్రత్యేక హోదా కోసం ప‌ట్టుబ‌ట్ట‌కుండా ఏ విధంగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పేరిట బీజేపీకి అండ‌గా నిలుస్తార‌ని ప్ర‌శ్నిస్తోంది. అయితే వీటిపై వైసీపీ లీడ‌ర్ ససాయిరెడ్డి వాద‌న మాత్రం మ‌రో విధంగా ఉంది. ప్ర‌స్తుతానికి తామంతా అధినేత ఏం చెబితే అదే మాట‌ను గౌర‌వించి ముందుకు వెళ్తామ‌ని, ఇందులో ర రెండో ఆలోచ‌న‌కు తావేలేద‌ని అంటున్నారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి కానీ ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా రాష్ట్రానికి ద‌క్కాల్సిన‌వి ద‌క్కించుకోకుండా ఏ విధంగానూ బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌దని కొంద‌రు నెటిజ‌న్లు సైతం అదే ప‌నిగా వైసీపీని ట్రోల్ చేస్తున్నారు.
Tags:    

Similar News