దళితుల భూములు బాబు అత్తగారి సొమ్మా?

Update: 2017-01-10 12:58 GMT
ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై విపక్ష వైసీపీ అధినేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని... కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఆ భూములన్నీ తన అత్తగారి ఆస్తిలా భావిస్తూ లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.  కర్నూలు జిల్లాలో వైసీపీ చేపట్టిన  రైతు భరోసాయాత్రలో భాగంగా మహానంది మండలం గాజులపల్లిలో పంట నష్టపోయిన పసుపు రైతులను ఆయన పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారిక లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఎక్స్‌ గ్రేషియా మాత్రం కేవలం నలుగురికే ఇచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి కరవు తప్ప ఇంకేమీ రాలేదన్నారు.
    
రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం మానేశారని..  వైఎస్ హయాంలోప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చి పొలాలను తడిపేవని... కానీ.. ఇప్పుడు అదే శ్రీశైలం రిజర్వాయరులో  844 అడుగుల నీటిమట్టం ఉన్నా కూడా రాయలసీమ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.  చంద్రబాబు నిర్వహించే మంత్రివర్గ సమావేశాల్లో ఏనాడూ రైతుల గురించి మాట్లాడడం లేదని.. ఆయన దృష్టంతా భూములు లాక్కోవడంపైనే ఉందని ఫైరయ్యారు.
     
పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘటన వైఎస్ది అయితే, ఆ పథకాలను మూలన పడేసిన ఘనత చంద్రబాబుదని ఆయన ఎద్దేవాచేశారు.  ఆరోగ్యశ్రీ పథకాన్ని  చంద్రబాబు  నీరుగార్చారని...   108 - ఆరోగ్యశ్రీలను ఉనికి లేకుండా చేశారని అన్నారు.  ఫీజు రీయింబర్స్‌ మెంట్ పథకానికీ అదే గతి పట్టించారన్నారు.  రైతులు - మహిళలు - విద్యార్థులతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా చంద్రబాబు అందరినీ మోసం చేశారని జగన్ ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News