సంక్రాంతి వేళ ఒకేచోట బాబు.. జ‌గ‌న్‌

Update: 2018-01-12 04:10 GMT
మీరు గ‌మ‌నించారో లేదో.. విడి రోజుల్లో ఎలా ఉన్నా.. పండ‌గ వేళ‌లో రాజ‌కీయ నేత‌లు త‌మ విమ‌ర్శ‌ల‌కు.. ఆరోప‌ణ‌ల‌కు కాస్తంత రెస్ట్ ఇస్తుంటారు. మిగిలిన రోజుల మాదిరి పొలిటిక‌ల్ యాక్టివిటీస్ చాలా త‌క్కువగా ఉంటాయి. ఇక‌.. సంక్రాంతి.. ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల వేళ‌.. ఈ తీరు మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు.. రెండు మూడు రోజుల పాటు రాజ‌కీయాల‌కు కాస్తంత దూరంగా ఉంటారు.

ఈ సంక్రాంతికి మాత్రం అలాంటి ప‌రిస్థితి ఏపీలో ఉండే అవ‌కాశం లేన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ.. ఇంచుమించు ఒకే చోట పండ‌గ‌ను చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇరువురు నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేల‌టం ఖాయం.

పండ‌గ‌లు.. ప‌బ్బాలు అన్న‌ది ప‌ట్టించుకోకుండా మొక్కోవ‌ని దీక్ష‌తో పాద‌యాత్ర చేస్తున్న ఏపీ విప‌క్ష నేత‌.. ఇప్పుడు త‌న పాద‌యాత్ర‌ను చిత్తూరు జిల్లాలో నిర్వ‌హిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఎప్ప‌టి మాదిరే సంక్రాంతికి ఏపీ ముఖ్య‌మంత్రి త‌న సొంతూరుకు రానున్నారు. ప్ర‌తిఏటా సంక్రాంతి వేళ‌కు బాబు కుటుంబ‌మంతా ఆయ‌న సొంతూరైన చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారిప‌ల్లెకు వ‌స్తుంటారు.

ఈ ఏడాది కూడా అదే రీతిలో రానున్నారు. రేపు (జ‌న‌వ‌రి 13)  చిత్తూరు.. తిరుప‌తిలో ప‌ర్య‌టించి.. సాయంత్రానికి నారావారి ప‌ల్లెకు చేరుకోనున్నారు. 14.. 15 తేదీల్లో అక్క‌డే ఉండి 16న క‌నుమ పండ‌గ చేసుకున్న త‌ర్వాత అమ‌రావ‌తికి బ‌య‌లుదేర‌నున్నారు. అంటే.. సొంతూరులో మూడు రోజుల‌కు పైనే చంద్ర‌బాబు గ‌డ‌పనున్నార‌న్న మాట‌.

ఇదిలా ఉంటే.. విప‌క్ష నేత జ‌గ‌న్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కున్న షెడ్యూల్ ప్ర‌కారం జ‌గ‌న్ ఈ నెల 14 నాటికి చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌రిహ‌ద్దులు దాటాల్సి ఉంటుంది. అయితే.. పాద‌యాత్ర‌లో చోటు చేసుకున్న మార్పుల కార‌ణంగా ఈనెల 15.. 16 తేదీల్లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌చంద్రాపురం మండ‌లంలో జ‌గన్ ప‌ర్యటించ‌నున్నారు. అంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇద్ద‌రూ దాదాపు ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో.. ఒకే ఊరుకి ద‌గ్గ‌ర్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ప‌క్క‌ప‌క్క గ్రామాల్లో ఏపీకి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు సంక్రాంతి పండ‌గ చేసుకోవ‌టం యాదృచ్ఛిక‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఉదంతం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News