చేసే ఆరోపణలు సింక్ కావట్లేదు జగన్ బాబు

Update: 2016-04-26 07:21 GMT
తన ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్.. వివిధ పార్టీల అధినేతల్ని వరుసబెట్టి కలుస్తున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న రాజకీయ విధానాల్ని.. ఆయన పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల గురించి ఆయన వివరిస్తున్నారు. వివిధ పార్టీల అధినేతలతో పాటు.. కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.

సేవ్ డెమోక్రసీలో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో పర్యటిస్తున్న జగన్ తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్  ను కలిసిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని.. ఆయన పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. నిజంగా.. అంత వ్యతిరేకత వ్యక్తమై.. ప్రజలు విసిగిపోతే.. విపక్ష ఎమ్మెల్యేలు సైతం అధికారపక్షంలో చేరటానికి క్యూ కట్టాల్సిన అవసరం ఏముంటుంది?

ప్రజల్లోకి వెళ్లే విశ్వాసం బాబుకు లేదని.. ఆయనకు ఓట్లు రావని తెలిసినందునే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయటం లేదని వైఎస్ జగన్ మండిపడుతున్నారు. అధికారపక్షంపై విమర్శలు చేయటం తప్పేం కాదు కానీ.. చేసే విమర్శలు కాస్త అర్థవంతంగా ఉండటం.. ఆధారాల సహితంగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు పాలన తీరుపై ప్రజలు విసిగిపోతున్నారని ఓపక్క చెబుతూనే.. మరోపక్క నల్లధనంతో తమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారంటే.. రెండు వాదనలు కాస్త అయినా సింక్ కావాలి కదా..?
Tags:    

Similar News