ఆ రెండు చోట్లా జగన్ రేసు గుర్రాల్ని వారే..

Update: 2016-12-16 16:57 GMT
జగన్ స్పీడ్ పెంచేశారు. ఇటీవల కాలంలో మాంచి దూకుడు మీదున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు. అవకాశం చిక్కిన ప్రతిసారీ ఎన్నికలు త్వరలో వచ్చేస్తున్నాయని చెప్పే ఆయన.. తాజాగా మాత్రం ఎన్నికలు వచ్చేది 2019లోనే అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. తాజాగా పల్నాడులో పర్యటించిన ఆయన.. 2019లో జరిగే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల్ని తేల్చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు.

తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా జగన్ సమక్షంలో కాసు మహేశ్ రెడ్డి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. తెలుగుదేశం పార్టీ నేతల దురాగతాల్ని ప్రస్తావించారు. గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే దుర్మార్గాలు అన్నిఇన్ని కావన్న ఆయన.. ఇసుక నుంచి సినిమా హాళ్ల వరకూ అన్నిచోట్లా తెలుగుతమ్ముడు అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అన్న జగన్.. ప్రత్యేక హోదా మీద కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము.. ధైర్యం బాబుకు లేదన్న ఆయన.. బాబు సర్కారును బంగాళాఖాతంలో పడేసే రోజు దగ్గరకు వచ్చిందని వ్యాఖ్యానించారు. 2019లో జరిగే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని జగన్ ప్రకటించారు. గురజాల నుంచి కాసు మహేశ్ రెడ్డి.. నరసరావుపేట నుంచి గోపిరెడ్డి పోటీ చేస్తారని చెప్పటం ద్వారా.. అధిపత్య పోరుకు చెక్ పెట్టటంతో పాటు.. నేతల లక్ష్యం ఏమిటన్న విషయంపై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News