అదే విషయమైనా కావొచ్చు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఎవరి జపమైతే చేస్తారో.. వారికి సంబంధించిన విషయాల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ విషయంలో జరిగే తప్పులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. ఎవరేమన్నా.. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే కాదు.. మరో వందేళ్ల తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించి ఏపీ ప్రజలకు ఏమైనా భావోద్వేగ బంధం ఉందంటే.. అది పార్టీ వ్యవస్థాపకుడు.. పార్టీకి ఆక్సిజన్ లాంటి ఎన్టీఆర్ పేరు. దాంతోనే.. ఆ పార్టీ మనుగడ ఉంటుంది.
ఎన్టీఆర్ పేరును పక్కన పెట్టి మరే నేత పేరును తెచ్చే ప్రయత్నం చేసినా.. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావించినా అది ఆ పార్టీకే నష్టం వాటిల్లేలా చేస్తుంది. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించారే కానీ.. ఎన్టీఆర్ పేరుతో తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఒక ఆట ఆడేలా చేసుకున్న స్వయం కృతం మాత్రం చంద్రబాబే. తాను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కానీ.. విభజన తర్వాత ఏపీలో కొలువు తీరిన ఎన్నికల వేళలోనూ.. ఎన్టీఆర్ పేరుతో ఏమైనా చేయాల్సి ఉంది. కానీ.. అలాంటివేమీ చేయలేదు.
కేంద్రంలో చక్రం తిప్పిన సమయంలోనూ.. పార్టీ వ్యవస్థాపకుడికి భారతరత్నను ఇప్పించుకునే విషయంలోనూ చంద్రబాబు తప్పే చేశారన్న మాట వినిపిస్తుంటుంది.
మొన్నటికి మొన్న కొత్త జిల్లాల ఏర్పాటు వేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా క్రిష్ణా జిల్లా నుంచి బయటకు తీసి ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టటం ద్వారా.. బాబు చేయలేని పనిని తాను చేశానన్న భావన కలిగించటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు మరో మాస్టర్ స్ట్రోక్ కు జగన్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకొని.. ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామస్తులు సీఎం జగన్ నుకలిసి..ఎన్టీఆర్ పేరును జిల్లాగా పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే. ఈ మే 28న ఎన్టీఆర్ నూరో జయంతి. ఈ సందర్భంగా నిమ్మకూరులో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారని చెబుతున్నారు. విగ్రహాన్ని ఎప్పుడు తయారు చేస్తారో? ఎప్పుడు ప్రారంభిస్తారో తర్వాత.. ముందు అయితే వందఅడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి శంకుస్థాపన చేయటం ద్వారా.. చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని ఒక పార్టీవ్యవస్థాపకుడి వంద అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా అధికారపక్షం నిర్ణయం తీసుకోవటంలోనే జగన్ తెలివి కనిపిస్తుంది. ఈ ప్రకటన తర్వాత పద్నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారన్న పేరును సొంతం చేసుకోవటం ఖాయం. అదే సమయంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి కిందా మీదా పడాల్సిన పరిస్థితిని జగన్ కల్పించారని చెప్పక తప్పదు.