జిల్లాకో హైద్రాబాద్ : రుచికరమైన జగన్ హామీ!

Update: 2018-02-10 16:27 GMT
2013 నాటి పరిస్థితుల్ని గుర్తుతెచ్చుకోండి. సమైక్యాంధ్ర కావాలంటూ.. సీమాంధ్ర వ్యాప్తంగా చాలా ఉధృతంగా పోరాటాలు జరుగుతూ ఉన్న నేపథ్యం అది. తమ ప్రాంతం సరిగ్గా అభివృద్ధి కావడం లేదని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రాంతం వారు పోరాడడంలో ఒక అర్థం ఉంది. అయితే కేంద్రం ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పేసిన తర్వాత.. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. కేంద్రం ఎదుట ప్రత్యామ్నాయాల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు సమైక్యాంద్ర కోరుతున్న సీమాంధ్ర వాదులంతా.. ఒక ప్రత్యామ్నాయం ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తమకు అభ్యంతరం  లేదంటూ ఒప్పుకున్నారు. అదే- హైదరాబాదు నగరాన్ని మాత్రం రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండగల ఉమ్మడి ఆస్తిగా పరిగణించడం!!

హైదరాబాదు మనది అనే భావన ఉంటే చాలు.. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా మాకేం అభ్యంతరం లేదంటూ.. సీమాంధ్రమొత్తం హోరెత్తింది. హైదరాబాదుకోసం ఎందుకంత పట్టుపట్టారు.. చాలా మంది ఆరోపించినట్లు.. అందరికీ అక్కడ ఆస్తులన్నాయని కాదు. ఆస్తులు కొందరికే ఉంటాయి. కానీ రాష్ట్రానికంతా సంబంధించిన అభివృద్ధి అక్కడే కేంద్రీకృతం అయిందని అందరి భావన. అంత అభివృద్ధి తాము వేరుపడితే ఎప్పటికీ చూడలేం అని సీమాంధ్రులు అనుకున్నారు.

అయితే  ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అంతకంటె అద్భుతమైన మాట ఇస్తున్నారు. వైకాపా ప్రభుత్వం వస్తే.. ప్రత్యేకహోదా సాధ్యం అవుతుందని... హోదాను సాధించేవరకు అవిశ్రాంతంగా పోరాడుతాం అని.. హోదా రాగానే పారిశ్రామికీకరణ ఇబ్బడిముబ్బడిగా జరుగుతుందని జగన్ చెబుతున్నారు. ఇందులో అవాస్తవం ఎంతమాత్రమూ లేదు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా ఒక హైదరాబాదు లాగా తయారు కాగలదని ఆయన పేర్కొంటున్నారు. ప్రతి జిల్లా ఒక హైదరాబాదు అంటే.. కేవలం అభివృద్ధి కోణంలో మాత్రమే దీనిని చూడాల్సి ఉంటుంది. అంటే ఆ నగరంతో సమానమైన పురోగతిని దాదాపుగా ప్రతి జిల్లాలోనూ చూడగలం అని ఆయన చెబుతున్నారు. అతిశయోక్తి లాగా కనిపిస్తున్నప్పటికీ ఇది నిజం. నగరాల రూపంలో కనిపించకపోవచ్చుగానీ.. ఉపాధి అవకాశాలు  పారిశ్రామికీకరణ రూపంలో ఇది నిజం కాగలదని ఆశించవచ్చు. హోదా రావాలని ప్రతి ఒక్కరూ కూడా పరితపించవచ్చు.
Tags:    

Similar News