నిజమేనండోయ్... హైదరాబాదులోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సహా ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరావడంతో రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమానికి విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. వైఎస్ జగన్ రాకకు ముందే ఇద్దరు చంద్రులు రాజ్ భవన్ చేరుకున్నారు. అందరూ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన జగన్... గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో గవర్నర్ పక్కన ఆయన కూర్చోగా... నరసింహన్ ఆయనతో చాలా సంతోషంగా మాట్లాడుతూ కనిపించారు. నరసింహన్ పక్కనే ఉన్న ఆయన సతీమణి కూడా జగన్ మాట తీరును ఆసక్తిగా గమనించారు. ఇక గవర్నర్ దంపతులకు ఓ మహిళ తర్వాత ఓ పక్కగా కూర్చున్న ఏపీ సీఎం చంద్రబాబు... జగన్ వైపు చూడకుండా ఉండలేకపోయారు. గవర్నర్ పక్కనే కూర్చుని ముచ్చటిస్తున్న జగన్ ను చంద్రబాబు ఆసక్తిగా గమనించడం అక్కడ కనిపించింది.
ఆ తర్వాత జగన్ అక్కడి నుంచి లేచి తనకు కేటాయించిన సీటు వద్దకు వెళ్లేందుకు బయలుదేరగా... గవర్నర్ లేచి మరీ జగన్ ను సాగనంపారు. అలా వెళుతున్న క్రమంలో జగన్ తొలుత చంద్రబాబు, ఆ పక్కనే కూర్చున్న దత్తాత్రేయ, ఆ పక్కనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు నమస్కరిస్తూ ముందుకు సాగారు. అలా అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న జగన్ ను చంద్రబాబు కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. మొత్తానికి ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్... రాజసం ఉట్టిపడేలా కనిపించారు. దీనికి సంబంధించి అన్ని తెలుగు పత్రికలు నేటి తమ సంచికల్లో ప్రత్యేకంగా ఫొటోలను ప్రచురించాయి. టీడీపీ అనుకూల మీడియాలోనూ జగన్ రాజసం ఉట్టిపడేలా ఉన్న ఫొటోలు కనిపించడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/