అడ్డదిడ్డమైన ఆధారాలు.. అడ్డంగా బుక్.. ఇది అవసరమా ?

Update: 2022-08-04 04:39 GMT
నిప్పు లేనిదే పొగ రాదంటారు. మరి.. నిప్పు లేకుండా కూడా పొగను తెప్పించే టాలెంట్ ను ప్రదర్శిస్తున్న వైసీపీ బ్యాచ్ తీరు.. అధినేతకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందా? నిజాన్ని దాయలేని పొగకు భిన్నంగా తమకు తాముగా క్రియేట్ చేసిన పొగ.. సొంత అధినేత ఇమేజ్ ను పొగబారిపోయేలా చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. బోడిగుండుకు మోకాలికి లింకు పెట్టటం కొన్నిసార్లు వర్కువుట్ కావొచ్చు. కాకుంటే.. ఇవాల్టి రోజున చాలామంది తరచి చూసే లాజిక్ మిస్ కాకుంటే ఇలాంటి ప్రయత్నాలు సక్సెస్ కావొచ్చు.

అందుకు భిన్నంగా కల్పనతో చేసే ఆరోపణలు కారు మేఘాల మాదిరి కరిగిపోతాయన్న విషయాన్ని తాజాగా వైసీపీ నేతలు మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యకు తనదైన భాష్యం చెప్పటం ద్వారా అందరి నోట్లో నానుతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏపీ అటవీ అభివ్రద్ధి సంస్థ ఛైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. వైసీపీ సోషల్ మీడియాను చూసే అతగాడు.. జగన్ వ్యతిరేకుల్ని ఎంతలా తిట్టి పోస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

అలాంటిది దేవేందర్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టు ఏపీ రాజకీయాల్ని గరంగరంగా మార్చింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో 273, 274, 275, 276 సర్వే నెంబర్లలోని 7.63 ఎకరాల భూమి గురించి ఉమామహేశ్వరితో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ గొడవ పడ్డారని.. పిన్నిని దారుణ వ్యాఖ్యలు చేశారని.. ఆ మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోస్టులు పెట్టారు.

దీన్ని చూసినంతనే చాలామంది ఒకింత అనుమానానికి గురయ్యారు. నిజమేనా? ఇలా జరిగి ఉండొచ్చా? అన్న సందేహానికి గురయ్యారు. టీడీపీ నేతల్లో కాస్తంత గుజ్జు ఉన్న వారు వెంటనే స్పందించి.. తెలంగాణ స్టాంపులు.. రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ధరణి పోర్టల్ ను చెక్ చేశారు. మరికొందరు.. తమకు తెలిసిన రెవెన్యూ సీనియర్ అధికారులకు ఫోన్లు చేసి.. సదరు సర్వే నెంబర్లు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ఉన్నాయా? అన్న ఆరా తీశారు.

అయితే.. ఆ సర్వే నెంబర్లు.. అంత భారీగా భూమి జూబ్లీహిల్స్ మొత్తంలోనే లేదని తేల్చేశారు. దీంతో.. తెలుగు తమ్ముళ్లు ఈ ఉదంతంపై మరింత ఆగ్రహంతో రియాక్టు అవుతున్నారు. అప్పటివరకు వైసీపీకి చెందిన నేతలు.. ఈ కొత్త వాదనను క్వశ్చన్ మార్కు పెట్టి ప్రశ్నలు సంధిస్తున్న వేళ.. వారికి కౌంటర్ గా అసలు నిజాన్ని తెర మీదకు తీసుకురావటంతో వైసీపీ పరివారానికి నోట మాట రాలేని పరిస్థితి.

ఇలాంటి తీరు.. వైసీపీలోని అత్యుత్సాహపు బ్యాచ్ కు బాగానే ఉన్నా.. అధినేత జగన్ ఇమేజ్ ను మాత్రం దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. సున్నితమైన అంశాల్ని ప్రస్తావించే వేళలో.. క్రాస్ చెక్ చాలా అవసరం. ఆ విషయంలో చోటు చేసుకునే చిన్న తప్పునకు భారీ నష్టం జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. జగన్ ఇలాంటి తీరుపై ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News