పార్ల‌మెంటు సాక్షిగా హోదా ఖూనీ అంటున్న జ‌గ‌న్‌

Update: 2016-07-30 10:38 GMT
ఏపీలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌నూ కుదిపేస్తున్న ఒకే ఒక్క అంశం ప్ర‌త్యేక హోదా! ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక స‌మ‌స్య‌పై ఒక‌ళ్ల‌నొక‌ళ్లు విమ‌ర్శించుకునే ఏపీ విప‌క్షాలు సైతం.. హోదా విష‌యంలో మూకుమ్మ‌డిగా కేంద్రంపై దాడికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ విష‌యంలో ఎవ‌రి వే వారు ఎంచుకుంటున్నారు. ఇప్ప‌టికే త‌న కేడ‌ర్‌ కు సీఎం చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర‌ - రాష్ట్రాల మ‌ధ్య సంబంధాలు లాగితే తెగిపోతాయేమోన‌ని, సున్నితంగా మాట్లాడాల‌ని తాను సూచించాన‌ని, అయిప్పుడు మాత్రం రెచ్చిపోండ‌ని ఆయ‌న దిశానిర్దేశం చేస్తున్నార‌ట‌. ఇక‌, ఇప్పుడు ఇదే అంశంపై విప‌క్షం జ‌గ‌న్ పార్టీ వైకాపా కూడా త‌న ప‌దునైన అస్త్రాల‌తో కేంద్రంపై హోరాహోరీకి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆగ‌స్టు రెండు మంగ‌ళ‌వారం నాడు ఏపీ బంద్‌ కి పిలుపినిచ్చారు. ఈ బంద్ ద్వారానైనా కేంద్రం క‌ళ్లు తెరుస్తుంద‌ని తాను భావిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

శ‌నివారం హైద‌ర‌బాద్‌ లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. . ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారంటూ బీజేపీ స‌హా కాంగ్రెస్‌ పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా బంద్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.  బంద్ కు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా  ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు. ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా విరుచుకుప‌డ్డారు. ఇరు ప‌క్షాల నేత‌లూ  మూకుమ్మ‌డిగా ఐదుకోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే - కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకుని - పోరాటానికి దిగాల్సిన చంద్ర‌బాబు.. ఇంకా బీజేపీతో అంట‌కాగుతామ‌ని చెబుతున్నారంటూ మండిప‌డ్డారు జ‌గ‌న్‌.

ఏపీకి అయిదేళ్లు కాదు...పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని ఇప్పుడు మాత్రం మాట‌త‌ప్పుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. తిరుపతి ఎన్నికల సభ సాక్షిగా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో ఏం జరిగిందో చూశామని... రాజ్యసభలో శనివారం జరిగిన పరిణామాలు చూస్తే మరోసారి ఆ రోజులు గుర్తొచ్చాయన్నారు. కేవ‌లం త‌న‌పై ఉన్న కేసుల నుంచి త‌ప్పించుకునేందుకే చంద్ర‌బాబు కేంద్రంతో రాజీ ప‌డుతున్నార‌ని, ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. పథకం ప్రకారం చంద్రబాబు డ్రామాలాడి - ఏపీని మోసం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశానికి - ఆర్థిక సంఘానికి సంబంధం లేదని, అయినా కేంద్రం ఈ విష‌యాన్నే బూచిగా చూపించి ఏపీని మోసం చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

 నీతి ఆయోగ్ పేరు చెప్పి ప్ర‌త్యేక హోదాను కేంద్రం ఏమీ ఎత్తేయ‌డం లేద‌ని, ఈశాన్య రాష్ట్రాల‌కు కొన‌సాగిస్తామ‌ని వైకాపా ఎంపీ సుబ్బారెడ్డి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చింద‌ని - దీనిని బ‌ట్టి ఒక ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే కేంద్రం మోసం చేస్తోంద‌ని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి 90 శాతం గ్రాంట్ల రూపంలో ఉంటాయని, హోదా లేని రాష్ట్రానికి 30 శాతం మాత్రమే గ్రాంట్ల రూపంలో ఉంటాయని హోదాతో ఒన‌గూరే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలోనే తాము ఇటు టీడీపీ, అటు బీజేపీల శైలిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి. హోదా సాధించాల‌నే ల‌క్ష్యంతోనే బంద్‌కు పిలిపిచ్చిన‌ట్టు వివ‌రించారు. మంగళవారం నిర్వహించే బంద్ కు అందరు సహకరించాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News