హోదా కోసం మూకుమ్మ‌డి యుద్దానికి సిద్ధం

Update: 2016-09-08 07:09 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం అన్యాయం చేసింద‌ని ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఫైర‌య్యారు. ఈ ప్యాకేజీలోని డొల్ల‌త‌నాన్ని నిర‌సిస్తూ.. ఈ నెల 10 శ‌నివారం రాష్ట్ర బంద్‌ కు పిలుపునిస్తున్న‌ట్టు చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా తో పాటు ప్ర‌త్యేక ప్యాక‌జీ కూడా ఇవ్వాల‌ని ఇది ఆంధ్రుల హ‌క్క‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బిక్ష కాదని ప్యాకేజీ ఇవ్వాలని, నిన్న కేంద్రం చేసిన ప్రకటనకు చట్టబద్ధత కల్పించాలని చలసాని డిమాండ్ చేశారు.ఈ క్ర‌మంలోనే తాము బంద్‌ కు పిలుపునిచ్చిన‌ట్టు చ‌ల‌సాని చెప్పారు. త‌మ బంద్‌ కు విద్యార్థి సంఘాలు స‌హా అన్ని ప‌క్షాలూ మ‌ద్ద‌తిచ్చాయ‌ని తెలిపారు.

ఇక‌, వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ కూడా కేంద్రం స‌హా చంద్ర‌బాబు ప్యాకేజీని ఆహ్వానిస్తూ చేసిన ప్ర‌క‌ట‌న‌కు నిర‌స‌న‌గా ఏపీ బంద్‌ కు పిలుపునిస్తున్న‌ట్టు చెప్పారు. అంతేకాకుండా, గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈవిష‌యంలో కామ్రెడ్ల‌తో క‌లిసి చంద్ర‌బాబు స‌హా కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నట్టు వెల్ల‌డించారు. హోదా కోసం పోరాడాల్సిన చంద్ర‌బాబు ప్యాకేజీకి త‌లొగ్గ‌డాన్ని తాము తీవ్రంగా నిర‌సిస్తున్నామ‌న్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెరిగేలా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు దగ్గరుండి కేంద్ర ప్రభుత్వం చేత ఏపీ ప్రజల చెవిలో క్యాబేజ్ పెట్టించారని జగన్ విమర్శించారు. కేంద్రం నుంచి వైదొలుగుతామని చంద్రబాబు చెప్పినప్పుడే ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివస్తుందన్నారు.

హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని జగన్‌ డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్‌ ను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరని జగన్ ప్రశ్నించారు. ఇదేమైనా చంద్రబాబు సొంత వ్యవహారమా అని నిలదీశారు. శనివారం జరిగే బంద్‌ లో అన్ని పార్టీలు పాల్గొనాలన్నారు.ఈ విష‌యంపై ఇప్ప‌టికే కామ్రెడ్స్‌ తో తాను మాట్లాడాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో రాష్ట్రంలో టీడీపీ - బీజేపీలు మిన‌హా అన్ని పార్టీలూ హోదాపై యుద్ధానికి సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. కాంగ్రెస్ ఇప్ప‌టికే ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. జైట్లీ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా ఆందోళ‌న‌ల‌కు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు.
Tags:    

Similar News