సింగిల్‌ గా పోటీ..జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు:జగన్

Update: 2018-06-29 13:12 GMT
పాదయాత్రతో ముందుకు సాగిపోతున్న వైసీపీ అధినేత జగన్ మొక్కవోని సంకల్పం చూసి జాతీయ మీడియా ఆయన వద్దకొచ్చింది. జగన్ పాదయాత్రం 200 రోజులు పూర్తయిన సందర్భంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూస్థాన్ టైమ్స్ జగన్‌ తో ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన తమ పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ స్టాండేమిటి.. ఎన్నికల తరువాత కేంద్రంలో మద్దతివ్వాల్సివస్తే ఎవరికిస్తాం వంటి కీలక అంశాల్లో ఆయన ఏమాత్రం అస్పష్టతకు తావు లేకుండా తమ పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పారు.
    
200 రోజులుగా 2,400 కిలోమీటర్లకు పైగా ఇప్పటికే పాదయాత్ర చేసిన జగన్ తన అనుభవాలను వెల్లడించారు. ఈ 200 రోజుల్లో తాను కలిసిన మనుషులు మారినా వారి కష్టాలు మాత్రం ఒకటేనని అన్నారు.  గత నాలుగేళ్లుగా సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అప్పుల భారాన్ని మోస్తూ సతమతం అవుతున్నారు. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలి పోయింది. గ్రామాల్లో ప్రజాస్వామ్యమనేదే లేదు. టీడీపీ నేతలతో నింపేసిన జన్మభూమి కమిటీలు స్థానిక ప్రభుత్వాల అధికారాలన్నింటినీ హరించి వేశాయని ఆయన చెప్పారు. పింఛన్లు - రేషన్‌ కార్డులు ఇవ్వాలన్నా చివరకు మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నా.. ఈ కమిటీలు టీడీపీ నేతల ద్వారా వెళ్లే వారికే ఇస్తున్నాయని ఆరోపించారు.
    
పాదయాత్రలో ఎన్నో సమస్యలు చూశానని... అవన్నీ మానవ తప్పిదాల వల్ల ఏర్పడినవేనని.. చంద్రబాబునాయుడు పరిపాలన అధ్వానంగా ఉన్నందువల్ల ఉత్పన్నమైనవేనని అన్నారు.. రూ 87,612 కోట్ల రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో సగటున ఏటా మాఫీ చేసిందల్లా రూ.3,000 కోట్లు మాత్రమేనని ఆయన ఆరోపించారు.
    
ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ రాజీ లేకుండా నిరంతరం పోరాడుతున్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రమే. చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నారని అన్నారు. ముందస్తు ఎన్నికల గురించి తానేమీ ఆలోచించలేదని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బహుముఖ పోటీ ఉన్నా తమకేమీ ఇబ్బంది ఉండదని... 2014 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్ - బీజేపీ మద్దతుదార్లు ఇద్దరూ కూడా టీడీపీకే ఓట్లేశారని.. ప్రస్తుతం ఆ పార్టీలు రెండూ టీడీపీ ఓట్లనే చీల్చుతాయి తప్ప వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఓట్లను కానే కాదని జగన్ సూత్రీకరించారు.
    
కలిసి పోటీ చేసే విషయమై తన వద్దకు ఏ ప్రతిపాదనా రాలేదని... ఎవ్వరి మద్దతూ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. వైసీపీకి ఏపీలో 2019 ఎన్నికల్లో 25కు గాను 20 ఎంపీ స్థానాలు వస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ...  ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపే పార్టీకి లేదా కూటమికి మాత్రమే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. జాతీయ స్థాయిలో ఏదైనా ఫ్రంట్‌ లో గాని - మిత్రపక్షాల కలయికలో గాని చేరాలన్న ఆసక్తి తనకు లేదని చెప్పారు.


Tags:    

Similar News