అందుకే విజయసాయిరెడ్డి అభ్యర్థి అయ్యారట

Update: 2016-05-26 11:16 GMT
జగన్ కు ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డికి మధ్యనున్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని జగన్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ వివరణ ఇవ్వటం కనిపించింది. రాజ్యసభకు పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఖరారు చేసిన సందర్భంగా పార్టీ నేతలకు జగన్ వివరణ ఇచ్చినట్లుగా ప్రసంగం సాగటం విశేషంగానే చెప్పాలి.

నిజానికి విజయసాయిరెడ్డిని రాజ్యసభకు అభ్యర్థిగా ఎంపిక చేయటాన్ని వ్యతిరేకించే వారెవరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారని అనుకోలేం కూడా. కానీ.. తన తీరుకు భిన్నంగా.. పార్టీ నేతలతో భేటీ అయిన జగన్.. రాజ్యసభకు అభ్యర్థిగా తన ఎంపిక గురించి వెల్లడించటమే కాదు.. విజయసాయి రెడ్డినే తాను ఎందుకు ఎంపిక చేసిన విషయాన్ని వివరంగా చెప్పిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.

మనుషుల మధ్య సంబంధాల్ని చంద్రబాబు డబ్బుతో కొనాలని చూస్తున్నారని.. బాబు రాజకీయాలు దుర్మార్గమైనవని విరుచుకుపడిన జగన్.. విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యత్వం కోసం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయటాన్ని సమర్థించుకున్నారు. సాయిరెడ్డి విలువలకు కట్టుబడ్డారని.. అక్రమ కేసుల్లో తనకు వ్యతిరేకంగా చెప్పమని ఆయనపై ఒత్తిడి తెచ్చారని.. కానీ ఆయన సత్యాన్ని నమ్ముకొని.. వాస్తవాలను మాత్రమే చెప్తానని స్పష్టం చేశారన్నారు.

తనపై కేసులు నమోదు చేసిన సందర్భంగా విజయసాయి రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారని.. ఎన్ని కష్టాలు ఎదురైనా సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి.. అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్టీలో విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామన్న సంకేతాల్ని పంపటం కోసమే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఏ మాటకు ఆమాటే చెప్పాలి కానీ.. జగన్ కాస్త ఓపెన్ గానే మాట్లాడతారు సుమా. తనకు ‘‘అండ’’గా ఉన్న వారికి ఎలాంటి పదవులు దక్కుతాయన్న విషయాన్ని పార్టీ నేతలకు ఎంత చక్కగా చెప్పారో కదా..?
Tags:    

Similar News