నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడు పోరాట‌మా?

Update: 2018-07-01 05:55 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ‌డిచిన కొద్ది నెల‌లుగా బాబు నోరు తెరిస్తే చాలు.. ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్న తీరు తెలిసిందే. గ‌తాన్ని ప్ర‌జ‌లు మ‌ర్చిపోయార‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారేమో కానీ.. ప్ర‌ధానిపై బాబు కురిపించిన ప్ర‌శంస‌ల జ‌ల్లుల్ని ప‌క్క‌న పెట్టేసి.. ఆయ‌న త‌ప్పుల్ని అదే ప‌నిగా ఎత్తి చూపిస్తున్నారు. ఇలాంటివేళ‌.. బాబు మాట‌ల్లోనే మోసాన్ని ఏపీ విప‌క్ష నేత ఎత్తి చూపించారు.

బాబుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌గ‌న్‌.. నాలుగేళ్లు మోడీ స‌ర్కారుతో కాపురం చేసిన బాబు స‌ర్కారు.. ఏపీకి న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన వాటి గురించి మాట్లాడ‌కుండా నిద్ర పోయిందా? అని నిల‌దీశారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న అంశాల్ని వ‌దిలేసి.. ఇప్పుడు అదే ప‌నిగా త‌ప్పు ప‌డుతున్న తీరును ఎండ‌గ‌ట్టారు.

ఆరు నెలల్లోగా ప్ర‌త్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇస్తామ‌న్న‌వ‌న్నీ కార్యాచ‌ర‌ణ‌లోకి తెస్తామ‌న్న చంద్ర‌బాబు భారీ జాబితాను అప్ప‌ట్లో చెప్పార‌ని గుర్తు చేశారు.ఆర్నెల్ల‌లో ప్ర‌త్యేక హోదాతో పాటు.. క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారం.. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైన‌రీ.. పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్‌.. వైజాగ్‌.. చెన్నై ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్.. విశాఖ‌.. విజ‌య‌వాడ‌.. తిరుప‌తి విమానాశ్ర‌యాల‌ను అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా గుర్తింపు.. రైల్వేజోన్.. దుగ‌రాజుప‌ట్నం పోర్టు పూర్తి లాంటి అంశాల్ని పూర్తి చేస్తామ‌న్న బాబు.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏమీ చేయ‌లేద‌న్నారు.

ముఖ్య‌మంత్రి అయిన ఆర్నెల్ల‌కు చేస్తాన‌న్న బాబు.. ఆర్నెల్లు కాదు ఏడాది తీసుకున్న త‌ర్వాత అయినా కేంద్రం చేయ‌ని వాటి గురించి అడ‌గాల‌ని.. కానీ.. అదేమీ చేయ‌ని చంద్ర‌బాబు నిద్ర‌పోయారా? అంటూ నిల‌దీశారు. 2017 జ‌న‌వ‌రిలో కేంద్రం నుంచి ఏపీనే ఎక్కువ సాధించిందంటూ గొప్ప‌లు చెప్పిన చంద్ర‌బాబు.. ఈ రోజు మోడీపై ఇన్నేసి విమ‌ర్శ‌లు ఎందుకు చేస్తున్న‌ట్లు? అని ప్ర‌శ్నించారు.

విభ‌జ‌న హామీల‌న్నీ ఆర్నెల్ల లోపే చేయాల‌ని చ‌ట్టంలో ఉంటే.. నాలుగేళ్లు ఏం చేసిన‌ట్లు అన్న జ‌గ‌న్‌.. బీజేపీతో కాపురం చేసిన నాలుగేళ్లూ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని ఎందుకు గుర్తించ‌లేదు? అని ప్ర‌శ్నించిన జ‌గ‌న్‌.. ఎన్నిక‌లు వ‌స్తున్న వేళ ధ‌ర్మ‌పోరాటం అంటూ షో చేస్తున్నార‌న్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో 25 ఎంపీ స్థానాల‌కు 25 ఇవ్వాల‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం త‌న చేతిలో 20 మంది ఎంపీలు ఉన్న‌ప్ప‌టికీ ఏం చేశారు? అని ప్ర‌శ్నించారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో 201రోజున తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌కు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పోటెత్తారు.ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు జ‌గ‌న్‌. ఆయ‌నేమ‌న్నార‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

-  నాలుగేళ్లుగా జ‌రిగిన అన్యాయం మీద మాట్లాడ‌ని బాబు ఈ మ‌ధ్య‌న ధ‌ర్మ‌పోరాటం అంటూ మొద‌లెట్టాడు. నిన్న కాకినాడ‌లో అలాంటి కార్య‌క్ర‌మాన్నే చేప‌ట్టారు. మూడు గంట‌లు దీక్ష అంటాడు. కాకినాడ‌కు నాలుగు గంట‌ల‌కు వ‌చ్చి.. ఆరింటికి వెళ్లిపోతాడు. అక్క‌డ ఓ స్క్రీన్ పెట్టి.. మోడీ అప్పుడేమ‌న్నాడు అని చూపిస్తాడు. బాగుంది. ఆయ‌న చేయ‌లేదు.. నువ్వు చూపించింది మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ గ‌డిచిన నాలుగేళ్లుగా ప్ర‌తి యువ‌భేరీలో చెబుతున్న‌దే.

- మ‌రి.. నాలుగేళ్లుగా చంద్ర‌బాబు ఏం చేస్తున్న‌ట్లు?  నాలుగేళ్ల‌లో ఊస‌ర‌వెల్లిగా ఎన్నెన్ని రంగులు మార్చావో.. అవెందుకు చూపించ‌వు?  బీజేపీతో యుద్ధ‌మంటూ సినిమా చూపిస్తాడు.

- బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది మార్చి 16న అయితే.. ఏప్రిల్ 20న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డును ప్ర‌క‌టించారు. అందులో బీజేపీ మ‌హారాష్ట్ర అధ్య‌క్షుడు.. ప్ర‌స్తుత రాష్ట్ర ఆర్థిక‌మంత్రి భార్య‌ను టీడీపీ స‌భ్యురాలిగా నియమించాడు.

- ఓ ప‌క్క యుద్ధ‌మంటూనే మ‌రోప‌క్క బీజేపీ నేత‌ల‌కు ప‌ద‌వులు ఇస్తాడు

- ఇంకోవైపు బాల‌కృష్ణ షూటింగ్ జ‌రుగుతుంటుంది. ఎన్టీఆర్ బ‌యోగ్ర‌ఫీ షూటింగ్ చేస్తుంటారు. వెంట‌నే సీన్ క‌ట్ చేస్తే.. వెంక‌య్య‌నాయుడు క‌నిపిస్తాడు. బాల‌కృష్ణ‌కు గంట‌ల కొద్దీ చ‌ప్ప‌ట్లు కొడుతూనే ఉంటాడు. ఇవ‌న్నీ స‌రిపోన‌ట్లు నిన్న‌నే చూశా. చంద్ర‌బాబు ఏదో మీటింగ్లో చెబుతున్నాడు. ఆ ప‌క్క‌నే కామినేని శ్రీ‌నివాస్ కూర్చొన్నాడు.

- మొట్ట‌మొద‌టిసారి ఎంపీ అయిన విజ‌య‌సాయి రెడ్డికి మోడీ స్నేహితుడైన‌ట్లు.. ఆయ‌న్ను రోజు క‌లుస్తున్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు. బాబు ప‌త్రిక‌లు ఊద‌ర‌గొడుతున్నాయి. అస‌లు మోడీకి ప‌నీపాట ఏమీ ఉండ‌దా?  విజ‌య‌సాయి రెడ్డినే పిలుచుకొని మాట్లాడ‌తారా?  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బుర‌ద జ‌ల్ల‌టానికి విజ‌య‌సాయిరెడ్డి వాళ్ల‌కు దొరికాడు.

- ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మీద విష ప్ర‌చారం మొద‌లు పెట్టారు. త‌న సొంత ప‌ని మీద ఢిల్లీకి వెళ్లాడు. ఆయ‌న మొద‌టిసారి ఎన్నిక‌య్యాడు. ఆయ‌న రాంమాధ‌వ్ ఇంటికి వెళ్లాడ‌ట‌. వాళ్లంతా అక్క‌డే ఉండి చూసిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తూ ఒక బండ మీదేశారు.

- ఇలాంటి వ్య‌క్తులే కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త‌ను ఇదే ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా పెట్టుకున్నారు. ఈ విష‌యం మేం అడిగితే.. ప్ర‌భుత్వం ఉంచి వైదొలుగుతున్న‌ట్లు ప‌ర‌కాల చేత ప్ర‌క‌ట‌న ఇప్పించారు. కానీ.. ఇప్ప‌టికి ఆయ‌న కొన‌సాగుతూనే ఉన్నారు. ఇంత‌క‌న్నా అన్యాయం ఎక్క‌డైనా ఉంటుందా?
 
- చేసేవి త‌ప్పుడు ప‌నులు.. చెప్పేవి శ్రీ‌రంగ నీతులు. ఈ మ‌ధ్య‌న బాబు తీస్తున్న సినిమా.. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు.. నాలుగు నెల‌ల కోసం. నెల‌రోజులుగా ఆయ‌న క‌ర‌ప‌త్రం నీడులో క‌నిపించిందేమిటి?  రోజుకో కొత్త స్కీం.

- విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న మాట్లాడుతూ.. రూ.20ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని.. 40 ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌చ్చాయని చెప్పారు. అవి ఎక్క‌డైనా క‌నిపించాయా?  బాబు విమాన‌మెక్కి విదేశాల‌కు వెళితే చాలు.. ఆయ‌న మీడియా హ‌డావుడి చేస్తుంది. ఆయ‌న విదేశాల్లో ఉంటాడు. ఆయ‌న క‌ర‌ప‌త్రం మాత్రం మైక్రోసాప్ట్‌.. ఎయిర్ బ‌స్.. బుల్లెట్ ట్రైన్.. హైప‌ర్ లూమ్ వ‌చ్చేసింద‌ని రాసేస్దుంది.

- నాలుగేళ్లుగా ఇదే సినిమా చూపిస్తున్నారు. బాబు వ‌స్తే జాబుల‌న్నారు. హోదా ఉంటే ఆదాయ‌ప‌న్ను.. జీఎస్టీ క‌ట్టాల్సిన ప‌ని లేదు. అప్పుడే హోట‌ళ్లు.. ప‌రిశ్ర‌మ‌లు.. ఆసుప‌త్రులు క‌ట్ట‌టానికి ముంద‌కొస్తారు. అవ‌న్నీ చంద్ర‌బాబుకు తెలుసు. కానీ.. ఆయ‌న నాలుగేళ్లుగా మ‌న‌కు సినిమా చూపిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News