800 కిమీ:జనానికి జగన్ అంటే నమ్మకం!

Update: 2018-01-10 13:55 GMT
‘ఎనిమిదిలో లోకముంది రామయా... బతుకు ఎనిమిదితో పోల్చి చూస్తే చాలయా..’ అంటూ నరసింహ చిత్రంలో రజనీకాంత్ ఓ పాట పాడుతారు. ఎనిమిది అంకెతో ముడిపెట్టి.. ఎనిమిది అనే మైలురాయి ప్రతిదీ జీవితంలో ఒక కీలకఘట్టం అంటూ తనదైన భాష్యం చెప్తాడు. దాని సంగతి ఎలా ఉన్నప్పటికీ.. 800 కిలోమీటర్ల పాదయాత్ర అంటే సామాన్యమైన విషయం కాదు. నవంబరు 6న పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ 800 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. తన యాత్ర ద్వారా ప్రజల కష్టాలను - ప్రభుత్వం అచేతనత్వం కారణంగా.. వారు పడుతున్న ఇక్కట్లను స్వయంగా తెలుసుకుంటూ.. ముదుకు సాగుతున్న జగన్ కు ఈ సందర్భంగా ప్రజలు నీరాజనాలు పట్టడం విశేషం. పాదయాత్ర ప్రారంభించిన నాటినుంచి.. ప్రతి వంద కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసిన తర్వాత.. ఒక మొక్కను నాటుతూ వెళ్తున్న జగన్ 800 కిమీల మైలురాయిని దాటిన చోట కూడా మొక్క నాటారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని నల్లవెంగణపల్లి వద్ద.. ఆయన యాత్ర సాగుతోంది.

జగన్ పాదయాత్ర జరుగుతున్న ప్రతి ఊరిలోనూ ఆయనకు మంచి స్పందన లభిస్తోంది. ప్రజలు పేదలు స్వచ్ఛందంగా తరలివచ్చి.. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తీసుకురావడానికి ఆరాటపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం జన్మభూమి సభలు పెట్టి.. వచ్చి అర్జీలు ఇచ్చుకోండి అని విపరీతంగా ప్రచారం చేస్తున్నా.. అధికారుల్ని పల్లెలకు తోలుతున్నా పట్టించుకోని జనం.. ప్రతిపక్షంలో ఉన్న జగన్.. పాదయాత్రగా వస్తోంటే.. తమంతగా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటే.. ఆయన మీద వారిలో ఉన్న నమ్మకానికి అది నిదర్శనం అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

జగన్ పాదయాత్ర ఇప్పటిదాకా రాయలసీమ జిల్లాల్లోనే సాగింది. కడప జిల్లాలో ప్రారంభించి.. అనంతపురం కర్నూలు జిల్లాలను కూడా పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో నడుస్తున్నారు. ఈ జిల్లాలోనే 900 కిమీల మైలురాయిని కూడా దాటేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News