వారి కోసం కేసుల‌కు సిద్ధ‌మ‌న్న జ‌గ‌న్‌

Update: 2016-11-23 04:42 GMT
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ప‌రిధిలో నిర్మిస్తున్న‌ దివీస్ మందుల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి గ‌ళం విప్పారు. తాజాగా అక్క‌డ నిర్వ‌హించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున దివీస్ బాధితులు తరలి రాగా జగన్ ప్రసంగించారు. దివీస్ యాజమాన్యం తక్షణం నిర్మాణ పనులు మానుకుని వేరేచోటకు తరలిపోవాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన నిలబడి - పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అవ‌స‌రైమైతే స్థానికుల కోసం కేసులు భ‌రించేందుకు అయినా సిద్ధ‌మ‌ని బాధితుల‌కు భ‌రోసా ఇచ్చారు. దివీస్ మందుల కంపెనీని ప్రజా నిరసనల మధ్య బలవంతంగా నిర్మించిన పక్షంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీని తొలగిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా - ప్రాంత ప్రజలకు అండగా ఉండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని జ‌గ‌న్ పున‌రుద్ఘాటించారు.

దివీస్ పరిశ్రమ ఏర్పాటైతే ఈ ప్రాంతమంతా కాలుష్య భరితంగా మారిపోతుందని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటైతే 65 లక్షల లీటర్ల నీటిని పరిశ్రమకు ఉపయోగిస్తూ, అందులో 55 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను తిరిగి సముద్రంలోకి విడిచిపెడతారని తెలిపారు. దీంతో విప‌రీత‌మైన కాలుష్యం ఏర్ప‌డి ఈ ప్రాంత మత్స్యకారులంతా వీధిన పడే ప్రమాదం ఉందని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక్కడ చాలా కాలంగా హేచరీలను అభివృద్ధి చేశారని, వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.400 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందన్నారు. హేచరీలకు కూడా మెడికల్ కంపెనీ ఏర్పాటుతో తీవ్ర విఘాతం కలుగుతుందని జ‌గ‌న్ తెలిపారు.  దివీస్ సంస్థ 55 లక్షల లీటర్ల కలుషిత నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుంద‌ని పేర్కొన్న జ‌గ‌న్ 65 లక్షల లీటర్ల నీరంటే వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో ఒక రోజు ఉపయోగించుకునే నీటి కంటే ఎక్కువ అని అన్నారు. ఇలా నిత్యం 55 లక్షల లీటర్ల కలుషిత నీరు సముద్రంలో కలిస్తే మత్స్య సంపద పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చున‌ని జ‌గ‌న్ అన్నారు. ఇంత‌టి క‌లుషిత వాతావ‌ర‌ణంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లే పరిస్థితి ఉండదని చెప్పారు. ఇక్కడ హ్యాచెరీలు బతకాలంటే, అందులో 25 వేల మంది ఉద్యోగాలు నిలబడాలంటే, దేశానికి ఏటా రూ.23 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం రావాలంటే సముద్రపు నీళ్లు కావాలని అందుకోసం దివీస్ కంపెనీ ఏర్పాటు కావ‌ద్ద‌ని జ‌గ‌న్ సూచించారు.

ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.5 లక్షలు చెల్లించి సుమారు 670 ఎకరాలను దివీస్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నిందని జ‌గ‌న్‌ విమర్శించారు. చిన్న సన్నకారు రైతుల నుండి ఎకరం, రెండెకరాల భూములను బలవంతంగా లాక్కుని దివీస్ కంపెనీకి కట్టబెట్టడం ఎంత వరకు సమంసమని జ‌గ‌న్‌ ప్రశ్నించారు. గత 82 రోజులుగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, పోలీసు బలగాలను రంగంలోకి దించారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. బాధితుల పక్షాన పోరాడుతున్న తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై 22 అక్రమ కేసులను పోలీసులు నమోదు చేశారని, అందులో 7 హత్యాయత్నం కేసులు పెట్టార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళలని చూడకుండా బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్‌లు చేస్తున్నారని, 82 రోజులుగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ను ఎందుకు విధించాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. బహిరంగ సభ వేదికపై ఈ ప్రాంతానికి చెందిన సుమారు పది మంది బాధితులతో దివీస్ ఫ్యాక్టరీ కారణంగా ఎదురైన సమస్యలపై మాట్లాడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News