కోడెలతో జగన్ మాట్లాడింది ఇదేనా?

Update: 2016-08-19 06:28 GMT
ప్రతి ఏడాది రెండు సార్లు ‘ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు గవర్నర్. జిల్లా కేంద్రంలో కలెక్టర్.. రాష్ట్ర రాజధానిలో గవర్నర్.. దేశ రాజధానిలో రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఆనవాయితీ. బ్రిటీషోడి ఆనవాయితీని నేటికీ అమలవుతూనే ఉంది. రిపబ్లిక్ డే.. ఆగస్టు 15 సందర్భంగా ఎట్ హోం ఫంక్షన్ ను నిర్వహిస్తారు. దీనికి రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు మొదలు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతుంటారు. కాసింత ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. మంద్ర సంగీతం నడుమ కార్యక్రమం సాగుతుంది.

అయితే..ఈసారి హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమం కాస్తంత హాట్ హాట్ గా జరిగినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు చంద్రుళ్లతో పాటు.. ఏపీ విపక్ష నేత జగన్ తొలిసారి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు చంద్రుళ్ల తో పాటు జగన్ వైపే అందరి దృష్టి పడిందని చెప్పాలి. ఈ ముగ్గురు ఎవరితో మాట్లాడినా.. ఏటువెళ్లినా అందరూ గమనిస్తూనే ఉన్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో ఏపీ విపక్ష నేత జగన్ కాసేపు మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. అసెంబ్లీ సమావేశాల్లో కోడెలపైన హాట్ హాట్ వ్యాఖ్యలు చేసే జగన్.. పబ్లిక్ ఫంక్షన్ లో అంతలా ఏం మాట్లాడారన్న అత్రుత పలువురిలో వ్యక్తమైంది. ఈ అంశంపై కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా దృష్టి సారించి.. కొంత సమాచారాన్ని సేకరించాయి.

దీని ప్రకారం.. ఏపీ స్పీకర్ కోడెల పక్కన కూర్చున్న జగన్ మొదట కలుగజేసుకొని.. ‘‘అన్నా మీరు ఆ కుర్చీలో ఎన్ని రోజులు ఉంటారు. మాకు మీతోని పోరాటం చేయటానికే సరిపోతుంది’ అని నవ్వుతూ వ్యాఖ్యానిస్తే.. దానికి కోడెల ముక్తసరిగా.. ‘‘నేను ఏది చేసినా రూల్స్ ప్రకారమే చేస్తా. ప్రతిపక్షంగా మీకు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవటం చేతకావటం లేదు. ఎవరు ఎంతసేపు మాట్లాడారో లెక్కలు చూసుకోండి’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇది జరిగిన తర్వాత.. ఫిరాయింపుల మీదకు చర్చ నడిచిందని చెబుతున్నారు. రాజకీయాల్లో ఫిరాయింపులు అన్యాయం కదా.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే వారిని అనర్హులుగా చేయాలి కదా అంటూ నవ్వుతూ జగన్ అడిగితే.. అది కూడా రూల్స్ ప్రకారమే జరుగుతుందని కోడెల ముక్తసరిగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సంభాషణ ఇలా సాగుతున్న వేళ.. చంద్రబాబు.. కేసీఆర్ రావటంతో మాటలకు కాసింత బ్రేక్ పడింది.

ఫిరాయింపుల వ్యవహారం కాసేపటికి చర్చకు రావటం.. అక్కడున్న నేతలు కొందరు కలుగజేసుకొని ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే కదా అని కామెంట్ చేయటం జగన్ చెవిలో పడిందని చెబుతున్నారు. దీంతో ఆయన గంభీరంగా మారిపోవటంతో అక్కడి వాతావరణం ఒకింత ఇబ్బందికరంగా మారినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. సరదా కబుర్లతో సాగే ఎట్ హోం కార్యక్రమం కాస్తంత హాట్ హాట్ గానే సాగిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయినా.. ఎట్ హోం లాంటి కార్యక్రమంలో అసెంబ్లీ ముచ్చట జగన్ ప్రస్తావించటం కాస్తంత ఆశ్చర్యకరమైన అంశంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News