బద్వేల్ ఆధిక్యంపై జగన్ అసంత్రప్తి

Update: 2021-11-08 09:55 GMT
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేలు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ 90 వేల పైగా ఓట్లతో గెలుపొందింది. మెజార్టీ పరంగా చూస్తే ఇది ఓ రికార్డే. కానీ, దీని పై జగన్ సమ్మతితో లేరని తెలుస్తోంది. తాను నిర్దేశించిన లక్ష మెజార్టీ రాకపోవడాన్ని ఆయన గుర్తు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి బద్వేల్ లో టీడీపీ పోటీచేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయనందున ఆ నియోజకవర్గంలో పోటీ పెట్టకూడదనే అప్రకటిత నియమానికి కట్టుబడి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఇక మిగిలింది కాంగ్రెస్, జనసేన, బీజేపీ. జన సేనతో అవగాహనలో భాగంగా బీజేపీ ఇక్కడ పోటీకి దిగింది. ప్రధాన పార్టీ పోటీలో లేనందున వైసీపీ మెజార్టీ లక్ష దాటాలని జగన్ టార్గెట్ నిర్దేశించారు. అయితే,90 వేల దగ్గరే మెజార్టీ ఆగిపోయింది. ఇప్పడు దీనిపైనే ఆయన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ కు అన్ని ఓట్లెలా వచ్చాయ్

బద్వేల్ లో బలం లేని బీజేపీకి 21 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు ఆరు వేలపైగా ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 1.12 లక్షల ఓట్లు పడ్డాయి. కాగా,తాను నిర్దేశించిన లక్ష ఓట్ల మెజార్టీ రాకపోవడానికి తోడు.. బీజేపీకి అన్ని ఓట్లు పడడాన్ని జగన్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పుకొనే తెలంగాణలోని హుజూరాబాద్ లో ఆ పార్టీకి మూడు వేల ఓట్లు కూడా రాలేదు. ఏమాత్రం బలం లేని, డబ్బు కూడా పంపిణీ చేయని బద్వేల్ లో మాత్రం అంతకు రెట్టింపు పడ్డాయి. ఈ అంశమూ జగన్ నోటీసుకు వెళ్లిందని సమాచారం. ముందుగా మేల్కొనక పోయి ఉంటే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉండేదని సీఎం ముందు ఉంచిన నివేదికలు పేర్కొంటున్నట్లు వినికిడి.

ఇన్ని చేసినా లక్ష దాటలేదే?

నియోజకవర్గంలో సామాజిక వర్గాల ప్రకారం మంత్రులను దించినా.. ఎమ్మెల్యేలను మోహరించినా.. అధికారులను పెట్టినా.. అవసరమైతే డబ్బులిచ్చినా.. ఆఖరికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లేకున్నా.. లక్ష మెజార్టీ రాలేదేమని జగన్ పోస్టుమార్టం చేసినట్లు వినికిడి. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీకి కలిపి 30 వేల ఓట్లు రావడాన్ని ఆయన నిశితంగా గమనించారు. ఇక టీడీపీ గనుక ఉండి ఉంటే మరింత గట్టి పోటీని ఎదుర్కొనేవారమని అభిప్రాయంతో బద్వేలు ప్రజలు ఉన్నట్టు సమాచారం. అధికార పార్టీ ఓటుకు రూ.500 ఇచ్చింది కాబట్టి ఓటర్లు బయటకు వచ్చారని.. లేదంటే ఆధిక్యం ఇంకా తగ్గేదని ఇంకొందరు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.

68 శాతమే ఓటింగ్

నిజానికి వైసీపీ చేపట్టిని లెక్కలేనన్ని ప్రజా సంక్షమే పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉండాలి. అదికూడా సీఎం సొంత జిల్లాలో మరింత ఎక్కువగా ప్రతిఫలించాలి. దీనికితోడు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినందున జరుగుతున్న ఎన్నికలో ఇంకా ఎక్కువ ఓటింగ్ జరగాలి. అయితే, 2.16 లక్షల ఓట్లున్న బద్వేల్ లో పోలయినవి 1.47 లక్షల ఓట్లే. అంటే ఓటింగ్ శాతం 68 మాత్రమే. ఇక్కడే వైసీపీ పెట్టుకున్న లక్ష ఓట్ల ఆధిక్యానికి గండపడింది. మరోవైపు తెలంగాణలో పూర్తి భిన్న పరిస్థితుల మధ్య జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బద్వేల్ కంటే దాదాపు 20 శాతం ఓటింగ్ అధికంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గంలో ప్రజలు భారీగా పోలింగ్ కు వచ్చారు. గెలుపోటములును పక్కనబెడితే ఇది అనూహ్య పోలింగ్ శాతమే. కానీ, ఏపీలో అన్నీ ఉండి... ప్రతిపక్షమూ బలంగా లేని ప్రాంతం, పరిస్థితుల్లో పోలింగ్ శాతం 70కి మించకపోవడం గమనార్హం. అంటే.. వైసీపీ వ్యూహ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ శాతాన్ని మరింత పెంచి .. సీఎం అంచనాకు తగినట్టు ఆధిక్యం సంపాదించాల్సిన చోట పార్టీ వర్గాలు విఫలమైనట్టు స్పష్టమవుతోంది. అదే పోలింగ్ శాతం మరింత తగ్గి ఉంటే.. పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది.


Tags:    

Similar News