జ‌గ‌న్ దెబ్బ‌కు పార్టీ ఖాళీనా?

Update: 2018-04-26 05:59 GMT
ఏపీ బీజేపీ నేత‌ల‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై వారు తీవ్ర అసంతృప్తితో ఉండ‌టంతో పాటు.. ర‌గిలిపోతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ఏపీ అధికార‌ప‌క్షంతో చెట్టాప‌ట్టాలు వేసుకున్న బీజేపీ నేత‌లు.. చేసిన పాపాల‌కు త‌గిన‌ట్లు ఒంట‌రి అయ్యారు.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ అనుస‌రిస్తున్న వైఖ‌రి నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అయితే.. ఆయ‌న రాక‌కు కార‌ణంగా వైఎస్ జ‌గ‌న్ గా చెప్ప‌క‌త‌ప్ప‌దు.  ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప‌లు ద‌ఫాలుగా నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చేస్తున్న జ‌గ‌న్ కార‌ణంగా చంద్ర‌బాబు మీద ఒత్తిడి అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.

ఇలాంటి వేళ‌లోనే.. పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల ముగింపు రోజున త‌మ లోక్ స‌భ ఎంపీలు సాధ‌న విష‌యంలో మోడీ స‌ర్కారు తీరుకు నిర‌స‌న‌గా రాజీనామాలు చేస్తార‌ని చెప్ప‌ట‌మే కాదు.. అన్నంత ప‌ని చేసేశారు. హోదా సాద‌న విష‌యంలో జ‌గ‌న్ క‌మిట్ మెంట్ ఏపీలో సెంటిమెంట్‌గా మారింది.

హోదా విష‌యంలో తాము సీరియ‌స్ గా దృష్టి సారించ‌క‌పోతే.. మ‌రింత న‌ష్ట‌పోవ‌టం ఖాయ‌మ‌న్న ఉద్దేశంతో బాబు రంగంలోకి దిగి.. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగానే మోడీ స‌ర్కారు నుంచి బ‌య‌ట‌కు రావ‌టం మొద‌లు బీజేపీతో మిత్ర‌త్వాన్ని చెల్లుచీటి ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే.. హోదా ఇష్యూలో బీజేపీ అనుస‌రిస్తున్న విధానాలు ఏపీలోని బీజేపీ నేత‌ల్లో కొత్త ఆందోళ‌న‌ల్ని నింపాయి. విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి మూకుమ్మ‌డిగా వ‌చ్చి చేరిన ప‌లువురు నేత‌లకు మోడీ నిర్ణ‌యాలు షాకింగ్ గా మార‌ట‌మే కాదు.. రానున్న ఎన్నిక‌ల‌తో స‌హా మ‌రో ద‌శాబ్దం పాటు ఏపీలో బీజేపీకి భ‌విష్య‌త్తు లేద‌న్న విష‌యం అర్థ‌మైంది. దీంతో.. వారు ప‌క్క‌చూపులు చూడ‌టం మొద‌లు పెట్టారు.

నాలుగేళ్ల త‌న ప్ర‌భుత్వంలో ఎన్నో అవినీతి ఆరోప‌ణ‌లు.. కుట్ర‌లు.. కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతున్న ఆరోప‌ణ‌ల‌తో పాటు.. అభివృద్ధి లేద‌న్న అప‌కీర్తిని ముట‌క‌ట్టుకున్న టీడీపీలోకి వెళితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌లో మాజీ కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ మారే విష‌యంలో సీరియ‌స్ గా దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌.. సీనియ‌ర్ మాజీ కాంగ్రెస్ నేత కాట‌సాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం సెట్ చేసుకోగా.. ఆయ‌న బాట‌లోనే మ‌రికొంద‌రు నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదంతా ఏపీ బీజేపీకి పెద్ద క‌ష్టంగా మారింది.

ఇప్ప‌టికే హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని ఎదుర్కొంటున్న క‌మ‌ల‌నాథుల‌కు.. పార్టీకి చెందిన నేత‌లు ఎవ‌రికి వారు.. వారి వారి దారి చూసుకోవ‌టంతో అధినాయ‌క‌త్వం రంగంలోకి దిగిన‌ట్లుగా చెబుతున్నారు. పార్టీ మారాల‌నుకునే వారికి త‌మ‌దైన శైలిలో సందేశాల్ని పంపి.. క‌ట్ట‌డి చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇలాంటి వాటి విష‌యంలో లైట్ అన్న‌ట్లుగా భావిస్తున్న వారు జ‌గ‌న్ పిలుపు కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తుంటే.. కొంద‌రు మాత్రం వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా సంకేతాలిస్తూ.. లోగుట్టుగా త‌మ ప్ర‌య‌త్నాల్ని మ‌రింత ముమ్మ‌రం చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి జ‌గ‌న్ కు.. బీజేపీకి లింకు ఉండి ఉంటే.. ఆ పార్టీ నేత‌లు త‌డి గుడ్డ మీదేసుకొని ప‌డుకునే ప‌రిస్థితి. ఒక‌వేళ‌.. బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ర‌హ‌స్య రాజ‌కీయ ఒప్పందం ఉంటే.. బీజేపీ నుంచి వ‌స్తామ‌న్న నేత‌ల తీరు మ‌రోలా ఉంటుంద‌ని చెబుతున్నారు. టీడీపీ నేత‌లు చెబుతున్న‌ట్లుగా బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ఏమీ లేద‌న్న  విష‌యం తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ రూపంలో త‌మ‌కు ఎదుర‌వుతున్న పార్టీ మార్పిడి ఇష్యూ ఏపీ క‌మ‌ల‌నాథుల‌కు పెద్ద క‌ష్టంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News