నేను ఒంటరిని : జగన్ మార్క్ ఎమోషనల్ పాలిటిక్స్....?

Update: 2022-06-27 14:30 GMT
అవును జగన్ ఒంటరే. ఆయన ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అన్న ప్రచారం సొంత పార్టీలోనే ఉంది. ఆయన ఏమనుకుంటే అదే చేస్తారు అనే వారూ ఉన్నారు. అయితే జగన్ కి జనాదరణ ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే జగన్ ఒంటరిగానే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఆనాడు ఆయన వెంట పెద్ద నాయకులు ఎవరూ లేరు. మరో వైపు కొండలాంటి కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో  ఆయన ఢీ కొట్టారు. కాంగ్రెస్ అయితే ఆయన మీద అక్రమమో సక్రమమో సీబీఐ ద్వారా కేసులు పెట్టించి జైలులో వేయించింది.ఇక జగన్ని ఇన్ని విధాలుగా బాధలు పెడుతున్నారు అని జనాల్లో సానుభూతి వెల్లువలా వచ్చింది. దాని ఫలితంగా జగన్ స్థాపించిన వైసీపీకి బలమైన రాజకీయ సామాజిక  పునాదులు ఏర్పాడ్డాయి. 2014లో తృటిలో అధికారం చేజారినా 2019 నాటికి మాత్రం 151 సీట్లలో జగన్ ఎదురులేని నాయకుడిగా ఎదిగి సీఎం అయ్యారు. ఇక మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న జగన్ వచ్చే ఎన్నికల గురించి అదే పనిగా ఆలోచన చేస్తున్నారు.

ఈ మధ్య ఆయన ప్రభుత్వ పధకాలను ప్రారంభించడానికి  ఒక్కో జిల్లాను ఎంచుకుంటున్నారు. అలా ఉత్తరాంధ్రా మీద గురిపెట్టి శ్రీకాకుళంలో అమ్మఒడి పధకం మూడవ విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన స్పీచ్ కాస్తా రాజకీయంగా వ్యూహాత్మకంగా సాగింది. ఇవతల పక్క ఒకే ఒక్క జగన్ ఉన్నారు. అవతల పక్కన ఎంతో మంది ఉన్నారు. వారంతా ఒక్క జగన్ తోనే కలసికట్టుగా పోరాడుతున్నారు అని ఎమోషనల్ స్పీచ్ ని జగన్ ఇచ్చారు.

తాను ఒక్క చంద్రబాబుతోనే పోరాటం చేయడంలేదని, ఆయన అనుకూల మీడియాతో పాటు, దత్తపుత్రుడితోనూ యుద్ధం చేయాల్సి వస్తోంది అని జగన్ అన్నారు. ఇక్కడ జగన్ తాను ఒంటరిని అని చెబుతూ అయినా  తాను భయపడడం లేదని తనకు అండగా ప్రజలు ఉన్నారని చెప్పుకున్నారు. అంటే తాను చేస్తున్న యుద్ధంతో ప్రజలను తన వైపుగా చేర్చుకుని టీడీపీని ఏమీ కాకుండా చేశారు అన్న మాట. అదే టైమ్ లో జగన్ ఒంటరిగా లేడు అంటే మీ అందరి వల్లనే అని చెప్పుకొచ్చారు. అంటే నాకు ప్రజల అండ ఉంది. ఉంటుంది, ఉండాలి అన్నది జగన్ మార్క్ పాలిటిక్స్ గా ఇక్కడ చూడాలి.

చంద్రబాబు అయినా టీడీపీ అనుకూల మీడియా అయినా మరే విపక్షం అయినా ప్రజల మద్దతు లేకుండా తనతో యుద్ధం చేయాలని చూస్తోందని జగన్ చెప్పదలచారు అన్న మాట. అంతే కాదు, తాను మంచి చేస్తూంటే ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు అని కూడా జగన్ చెప్పుకున్నారు. తాను పేదల పక్షంగా ఉంటూ వారి కోసం ఎన్నో పధకాలు చేపడుతూంటే అంతా ఒక్కటిగా మారి అడ్డుకుంటున్నారని, ఇది న్యాయమా ధర్మనా అని జగన్ నిలదీస్తున్నారు.

ఇలా జగన్ నిలదీయడం వెనక ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం ఉండడమే కాదు, ప్రజల కోసమే తాను వారితో యుద్ధం చేస్తున్నాను అని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది. పైగా తనని ఒక్కడిని చేసి అంత మంది వస్తారా. వస్తే వారిని అడ్డుకుని తనను కాపాడాల్సిన బాధ్యత ప్రజలదే సుమా అన్న సందేశమూ ఉంది.

మొత్తానికి జగన్ ఎమోషనల్ గా వర్కౌట్ అయ్యేలా ఈ తరహా  వ్యూహాన్ని రచించారు అనిపిస్తోంది. మరి జగన్ ఒకనాడు ఒంటరి అనే జనాలు ఆయన పక్షం చేరి సీఎం అయ్యేదాకా ఊరుకోలేదు. ఇపుడు మరోసారి జగన్ అధికారం కోరుకుంటున్నారు. తనను ఒంటరిని చేసి విపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని  చెబుతున్నారు. మరి ఈసారి జనాల మద్దతు జగన్ కి ఉంటుందా. ఆయన ఎమోషనల్ పాలిటిక్స్ కి జగన్ మొగ్గు చూపిస్తారా. చూడాలి మరి .
Tags:    

Similar News