బాబు ప‌త‌నం కుప్పం నుంచే మొద‌లుకావాలి

Update: 2018-01-05 04:37 GMT
ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. పార్టీ గెలుపు కుప్పం నుంచే మొద‌లుకావాల‌న్న ఆయ‌న‌.. గ‌త ఎన్నిక‌ల్లో రిటైర్డు ఐఏఎస్ అధికారి కె. చంద్ర‌మౌళిని కుప్పం నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యార‌ని.. అయిన‌ప్ప‌టికీ ఓట‌మి గురించి ప‌ట్టించుకోకుండా కుప్పం మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ప‌ని చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు.

కుప్పంలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చంద్ర‌మౌళి చేస్తున్న కృషి నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న బ‌రిలోకి దిగుతార‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కుప్పం నుంచే మొద‌లుకావాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌.. చంద్ర‌మౌళిని గెలిపిస్తే.. ఆయ‌న్ను మంత్రిని చేసి.. త‌న ప‌క్క‌నే కూర్చోబెట్టుకుంటాన‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న మోసాలు.. అక్ర‌మాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 52వ రోజైన‌ గురువారం చిత్తూరుజిల్లా పుంగ‌నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పాల‌మంద పెద్దూరు వ‌ద్ద పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్ ను చూసేందుకు.. ఆయ‌న మాట‌లు వినేందుకు భారీ ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. జ‌గ‌న్ ను చూసేందుకు సీఎం చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నుంచి భారీ ఎత్తున ప్ర‌జ‌లు రావ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌తి కార్య‌క‌ర్త అర్జునుడి మాదిరి మారి.. ఊరూరా బాబు హ‌యాంలో జ‌రుగుతున్న మోసాల గురించి చెప్పాల‌న్నారు. అమాయ‌కులైన బీసీల్ని సులువుగా మోసం చేయొచ్చ‌న్న ఉద్దేశంతో బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన చంద్ర‌గిరిని వ‌దిలేసి బీసీలు ఎక్కువ‌గా ఉండే కుప్పం ఎంచుకున్నార‌న్నారు. బాబు ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన బీసీల‌కు చేసిందేమీ లేద‌న్నారు.

నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌తో బాబు ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌లేద‌న్నారు. బీసీలంతా ఏకం కావాల‌న్నారు. రేపు చంద్ర‌బాబు మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న‌కు బీసీల‌పై ప్రేమ ఉంద‌నే మాట చెబితే.. బీసీల‌కు మీరేం చేశారు బాబూ.. అని గ‌ట్టిగా అడ‌గాల‌న్నారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చ‌దువుల కోసం ఎప్పుడూ ఇబ్బంది ప‌డ‌లేద‌ని చెప్పాల‌న్నారు

మా పిల్ల‌లు ఇంజ‌నీరింగ్‌.. మెడిసిన్ ఇంకా పెద్ద చ‌దువులు చ‌దివేందుకు ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా వైఎస్  అండ‌గా నిలిచార‌ని.. బీసీల‌పై ప్రేమ ఉందంటున్న బాబు అవేమీ ఎందుకు చేయ‌టం లేదో నిల‌దీయాల‌న్నారు. జ‌గ‌న్ మాట‌ల‌కు స‌భికుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న రావ‌టం గ‌మ‌నార్హం.  త‌న స‌భ కోసం కుప్పం నుంచి భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చిన వారి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా కుప్పం వ‌ర‌కూ రాలేక‌పోవ‌చ్చ‌ని.. తాను పాద‌యాత్ర‌లో రాలేక‌పోయిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌న్నింటిలోనూ బ‌స్సు యాత్ర చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఆ సంద‌ర్భంగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చి అక్క‌డి ప్ర‌తి మండలంలోనూ తిరుగుతాన‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News