తెలుగువారి పౌరుషానికి నిలువెత్తు రూపంగా చెప్పే కాకతీయ రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు. ఆ గడ్డపై నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో గడిచిన 184 రోజులుగా చేస్తున్న పాదయాత్ర శనివారం నాటికి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చేరింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
భారీ ఎత్తున హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేవించి జగన్ తన అలసటను మరిచి మరీ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు 15 అసెంబ్లీ స్థానాల్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టారు జిల్లా వాసులు. అయినప్పటికీ గడిచిన నాలుగేళ్లలో ఆ జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు.
+ జిల్లాలో మొత్తం 15కు 15 స్థానాలు ఇచ్చిన ఈ జిల్లాకు ఏం చేశాడో చంద్రబాబును గట్టిగా అడగండన్నా అని ప్రజలు అంటున్నారు. ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ఈ నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరక ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి అబద్ధాలు - మోసాల ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపేయాలి .
+ ఆశ్చర్యం కలిగించే రీతిలో ఇక్కడ ఇసుక దోపిడి జరుగుతోంది. పందలపర్రు - పెండ్యాల - ఖండవల్లి - తీపర్రు ఇసుక ర్యాంపుల నుంచి నాలుగేళ్లుగా ఈ దందా సాగుతోంది. ఇసుక రీచ్ లలో ప్రొక్లెయినర్లు - లారీలు కన్పిస్తాయి. కళ్లెదుటే రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుక తరలిపోతోంది. కలెక్టర్లు పట్టించుకోరు.. పోలీసులు దగ్గరుండి ఈ పనులు చేయిస్తారు. మొదట డ్వాక్రా సంఘాల పేరు చెప్పారు. తర్వాత సీసీ కెమెరాలు పెడతామన్నారు. తీరా చూస్తే డ్వాక్రా మహిళలు లేరు. సీసీ కెమెరాలు లేవు. ఇసుకను దోచేసేందుకు ఇసుక ఫ్రీ అని పేరు పెట్టుకున్నారు.
+ మీరు ఇల్లు కట్టుకునేందుకు.. ఇతరత్రా అవసరాలకు ఇసుక ఉచితంగా లభిస్తోందా? కానీ చంద్రాబాబు తన ఎమ్మెల్యేలకు.. బినామీ కాంట్రాక్టర్లకు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాడు. బాబు ముఖ్యమంత్రి అయిన మూడేళ్లపాటు స్టీల్ రేట్లు తగ్గిపోయినా కూడా తన బినామీలకు, లంచాలు ఇచ్చే కాంట్రాక్టర్లకు అంచనా విలువ భారీగా పెంచుతారు. ఇసుక మాఫియా ఆధారాలతో సహా అధికారులకు దొరికిపోయినా కూడా ఈ జిల్లాలో చర్యలుండవు. ఆధారాలన్నీ చెత్తబుట్టలోకి పోతాయి.
+ ఈ దోపిడీలో ఎమ్మెల్యేలు.. చినబాబు - పెదబాబు వరకు అందరికీ వాటాలు. ఇసుకే కాదు, మట్టిని కూడా వదిలిపెట్టలేదు. కోరుమామిడి - తాడిమళ్ల గ్రామాల్లో ఒక్కో చెరువును ఇరవై - ముప్పె అడుగులు తవ్వేశారు. మట్టిని తవ్వినందుకు డబ్బులు తీసుకుంటారు. అదే మట్టిని అమ్ముకున్నందుకు డబ్బులు లాగుతారు. ఈ నాలుగేళ్లలో మట్టి తవ్వకాల రూపంలో ఈ రాష్ట్రంలో రూ.34 వేల కోట్లు దోపిడి జరిగింది.
+ పుష్కరాల పేరుతో జరిగిన అవినీతికి సాక్ష్యాంగా నిలబడింది ఆ గడ్డర్ బ్రిడ్జి. కూలిపోయిన ఆ బ్రిడ్జికి మరమ్మతుల పేరుతో పుష్కరాల నిధుల నుంచి డబ్బులు పెట్టారు. పుష్కరాలు.. దేవుడి పేరు చెప్పి దోచేస్తున్న వైనానికి నిదర్శనంగా నిలబడింది ఆ బ్రిడ్జి. ఇదే నియోజకవర్గంలో వేలివెన్నులో రొయ్యల ఆధారిత పరిశ్రమల కారణంగా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోందని, ప్యాక్టరీ వ్యర్థాలను నరసాపురం, గోస్తానీ పంట కాలువల్లో వదిలిపెడుతున్నారని ఇక్కడున్న రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు.
+ నిజంగా నాన్నగారి పాలన ఎక్కడ - ఈ చంద్రబాబు పాలన ఎక్కడ? ఇక్కడ ప్రజలు నాలుగేళ్లుగా అడుగుతున్నా ఆటోనగర్ కూడా ఇవ్వని పరిస్థితి. పక్కనే గోదావరి కనిపిస్తోంది.. కానీ దాళ్వా సమయంలో పెరవలి, తణుకు సరిహద్దు ప్రాంతాలకు నీరు రాదు. డెల్టా ఆధునికీకరణ పనులు సరిగ్గా జరగవు. నీళ్లు ఇస్తున్నామా? లేదా? రైతులు ఎలా బతుకుతున్నారు? అనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి పట్టదు.
+ నాలుగేళ్ల క్రితం ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం - ఇల్లు కట్టిస్తాను అని బాబు ఊదరగొట్టాడు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టించిన పాపన పోలేదన్నా అని ప్రజలు అంటున్నారు. ఆ ప్రజలంతా రాజశేఖరరెడ్డి పాలన గుర్తు తెచ్చుకుంటున్నారు. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో పదివేల ఇళ్లు - నిడదవోలు పట్టణంలోనే దాదాపుగా వెయ్యి ఇళ్లు కట్టారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
+ చెరకు రసం రంగులో ఉన్న ఈ నీళ్లు తాగలేకపోతున్నామన్నా.. ఈ నీళ్లను సభలో చంద్రబాబుకు చూపించండన్నా.. అని ప్రజలు ఆ నీటిని బాటిళ్లలో తెచ్చిస్తున్నారు. 15కు 15 స్థానాలు అప్పగించిన ఈ జిల్లాకు ప్రజలకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేని అధ్వానమైన పాలన సాగుతోంది. రేపు ఎన్నికలొస్తే అదే బాటిల్ చూపించి ప్రజలకు చెరుకురసం ఇస్తున్నానని ఈ పెద్దమనిషి మైకుల్లో ఊదరగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత దారుణంగా మీడియాను మేనేజ్ చేయగల సమర్థుడు ఈ చంద్రబాబు.
+ సెల్ ఫోన్ - కంప్యూటర్ ను తానే కనిపెట్టాను అంటాడు. ఇలాంటి హైటెక్ పరిపానలలో ఫోన్ కొడితే మినరల్ వాటర్ వస్తుందో రాదో గానీ మందు బాటిల్ మాత్రం ఇంటికే వస్తుంది. రైతుల రుణాలు అక్షరాలా రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా మహిళల రుణాలనూ మాఫీ చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు అమలు చేశానని చెప్పుకుంటున్న రుణ మాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మీ అందరికీ తెలుసు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా పొదుపు సంఘాలను కూడా ఆయనే కనుక్కున్నట్లుగా గొప్పలు చెబుతున్నారు.
+ అప్పట్లో టీవీ అడ్వర్టయిజ్ మెంట్లు మీకు గుర్తుండే ఉంటాయి. టీవీ ఆన్ చేస్తే కనిపించే దృశ్యాలు భలే ఉండేవి. ఒక ఇంట్లో ఓ అక్క ఉంటుంది. ఆమె మెడలో మంగళసూత్రం ఉంటుంది. ఇంతలో ఓ చెయ్యి వచ్చి ఆమె మంగళసూత్రాన్ని గట్టిగా లాక్కుంటూ ఉంటుంది. వెంటనే మరో చెయ్యి వచ్చి ఆ చెయ్యిని పట్టుకుంటుంది. ఆ వెంటనే ఆయనొస్తున్నాడు.. ఆయనొస్తున్నాడు.. అని చెబుతుంది. కానీ ఈ రోజు బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వస్తున్నాయా?
+ మొత్తం ఐదేళ్లకైతే ఒక్కో ఇంటికి రూ 1,20,000 ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని చివరిలో ఆరు నెలలో - నాలుగు నెలలో మాత్రమే రూ.1000 ఇస్తాడట. అది కూడా రాష్ట్రంలో ఒక కోటి 70 లక్షల మంది ఉంటే, కేవలం పది లక్షల మందికేనట. ఇలాంటి పెద్దమనిషిని క్షమిస్తే రేపు మీ వద్దకు వచ్చి ఏం చెబుతారో తెలుసా? తాను ఎన్నికల్లో చేసిన హామీల్లో 98 శాతం నెరవేర్చానని చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటారు.
+ అయినా మీరు నమ్మరని - ప్రతి ఇంటికీ మనుషులను పంపించి ప్రతి చేతికీ రూ.3000 ఇస్తాడు. ఆ డబ్బు వద్దనకండి. రూ.5000 కావాలని గుంజండి. ఆ డబ్బంతా మన జేబుల్లో నుంచి కాజేసిందే. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పే వాళ్లను, మోసాలు చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని తీసుకు రండి.
+ నాలుగేళ్లుగా బాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. నాలుగేళ్లుగా ఈ పెద్దమనిషి పాలన చూశాం. ఇవాళ రేషన్ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. పెట్రోలు, డీజల్ ధరలు ఎక్కడా లేనట్లు రాష్ట్రంలో భగ్గుమంటున్నాయి. లీటరుకు రూ.7 అదనంటా బాదుతున్నారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా ఉపాధి అన్నారు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ ఏదీ లేదు. ఈ లెక్కన ఈ 48 నెలలకు గాను రూ.96 వేలు బకాయి పడ్డారు. ఈ వ్యవస్థలో మార్పు కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. వర్షం పెద్దగా కురుస్తోంది. నేను వర్షంలో తడవడానికి బాధపడను. కానీ నాతో పాటు మీరు తడవడం బాధ కలిగించే అంశం కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను