బాబు సున్నా మార్కుల లెక్క చెప్పిన జగన్

Update: 2016-07-09 04:53 GMT
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని షురూ చేసిన సంగతి తెలిసిందే. ఆర్నెల్ల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగం ఏపీ వ్యాప్తంగా ప్రజలకు వంద ప్రశ్నలతో కూడిన ప్రశ్నా పత్రం ఇవ్వటం.. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున ఇస్తారు. ఎన్నికల సందర్భంగా బాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఒక్కో మార్కు ఇస్తారు. మరి.. వంద మార్కులకు బాబుకు ఎన్ని మార్కులు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారితే.. జగన్ మాత్రం..బాబుకు వచ్చే మార్కుల లెక్క తేల్చి చెప్పేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సున్నా మార్కులు వస్తాయని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

అదెలానంటే ఆయన పాత లెక్కల్నిచెప్పుకొస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రైతుల అప్పులు మొత్తాన్ని తాను తీరుస్తానని ఎన్నికల సమయంలో చెప్పారని కానీ అలాంటిదేమీ జరగలేదని చెప్పిన జగన్.. రుణమాఫీ మొదలుకొని ఎన్నో హామీలు ఇచ్చారని.. ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంటికో ఉద్యోగం.. అది వచ్చే వరకూ నిరుద్యోగ భృతి..డ్వాక్రా రుణాల మాఫీ.. 3 సెంట్ల స్థలంతో పాటు.. రూ.1.5లక్షలతో అందరికి ఇళ్లు ఇలా చాలానే హామీల్ని చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు గడిచిన రెండేళ్లలో ఏం చేయలేదని.. అందుకే ఆ విషయాలపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తాజా కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెప్పుకొచ్చారు.

తామిచ్చిన ప్రశ్నాపత్రంలో వంద ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయని చెబుతున్న జగన్.. చంద్రబాబుకు సున్నా మార్కులు వస్తున్నట్లుగా జగన్ చెప్పటం గమనార్హం. రానున్న ఆర్నెల్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని.. తాను కూడా కొన్నిచోట్ల పాల్గొననున్నట్లుగా జగన్ చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని షురూ చేసి వారం కూడా కాకముందే.. బాబుకు సున్నా మార్కులు వస్తున్నట్లు ఎలా చెప్పేశారు? ఆర్నెల్ల పాటు సాగే కార్యక్రమానికి సంబంధించిన ఫలితాన్ని ఇంత త్వరగా చెప్పేయటంలో అర్థం ఏమిటి జగన్? అంటూ తెలుగు తమ్ముళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తాము నిర్వహించే టెస్ట్ లో అయినా చంద్రబాబుకు సున్నా మార్కులు తెప్పించలేకపోతే జగన్ కు అంతకుమించిన అవమానం మరొకటి ఉండదు కదా..?
Tags:    

Similar News