ప్రకాశం జిల్లాలో కీలక నియోజకవర్గానికి అభ్యర్థిని ఫిక్స్‌ చేసిన జగన్‌!

Update: 2022-10-20 09:01 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్‌ జగన్‌.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు.  

ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారి పైన చర్యలు మొదలు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై వేటు వేస్తున్నారు.

మరోవైపు ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన వంద మంది కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. వారిని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకుని నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు తెలుసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే పలు నియోజకవర్గాల కార్యకర్తలతో జగన్‌ మాట్లాడారు.

తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వంద మంది కార్యకర్తలతో సమీక్ష జరిపారు. 2014లో అద్దంకి నుంచి వైసీపీ తరఫున గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ ఆ తర్వాత కొంతకాలానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి అద్దంకి నుంచి గెలిచారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్‌కు గ్రానైట్‌ వ్యాపారాలు ఉన్నాయి. బలమైన నేతగా పేరుంది.  ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో విజయం సాధించాలని సీఎం జగన్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.  

19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, ఈ నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే మంచి విజయాలు సాధిస్తామన్నారు.

అద్దంకి నియోజకవర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా డీబీటీ విధానంలో రూ.1081 కోట్లు ఇచ్చామని తెలిపారు. తద్వారా 93,124 కుటుంబాలకు మేలు చేశామన్నారు. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. 47,123 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశామని సీఎం జగన్‌ గుర్తు చేశారు.

ఈ అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య కుమారుడు బాచిన కృష్ణచైతన్య పోటీ చేస్తారని జగన్‌ కార్యకర్తలకు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న బాచిన కృష్ణచైతన్య కూడా పాల్గొన్నారు.

టీడీపీ గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోనే నాలుగు స్థానాలను గెలుపొందింది. చీరాల నుంచి కరణం బలరాం, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కొండెపి నుంచి డోల బాలాంజనేయ స్వామి, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు టీడీపీ నుంచి గెలుపొందారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి షాక్‌ ఇచ్చిన ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేయాలని జగన్‌ కార్యకర్తలకు ఉద్భోధించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News