ఒకవైపు తిడుతూనే.. మరోవైపు అంతలా పెట్టటం.. ఇదేం లెక్క జగన్?

Update: 2021-06-29 10:30 GMT
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్సెస్ మీడియాకు సంబంధించి.. ఎవరు ఎటువైపు అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందరికి అన్ని విషయాలు తెలిసినవే. వైఎస్ హయాంలో ఆ రెండు పత్రికలు అంటూ తనలోపలి అసహనాన్ని వైఎస్ ఎప్పుడూ దాచుకున్నది లేదు. ఆయన కుమారుడు కమ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం తన వ్యతిరేకత మీడియా విషయాన్ని బాహాటంగానే వేలెత్తి చూపించేవారు. ఆ మాటకు వస్తే..ఆంధ్రజ్యోతి మీడియా సంస్థను తన ప్రోగ్రాంలు కవర్ చేయొద్దని చెప్పటమే కాదు.. తన ప్రెస్ మీట్ కు ఆ మీడియా ప్రతినిధి హాజరైతే.. ఇది సరైన పద్దతి కాదంటూ వ్యాఖ్యలు చేయటాన్ని మర్చిపోకూడదు.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఆ రెండు పత్రికలు వ్యవహరిస్తున్నాయంటూ సీఎం జగన్ తరచూ విమర్శిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సోమవారం అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్ లో రెండు పత్రికల గురించి.. వాటిల్లో వస్తున్న వార్తలు.. అందులోని నిజానిజాల విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈనాడులో వచ్చిన ఒక వార్తలో ఆక్సిజన్ లేక ప్రాణం పోయినట్లుగా వార్త రాశారని.. అసలు అలాంటి పరిస్థితి లేదని చెప్పటంతో పాటు.. ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలనే అలాంటి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వచ్చిన పలు కథనాల్ని ప్రస్తావిస్తూ.. అందులోని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. చేతిలో పేపర్ ఉందని ఇష్టారాజ్యంగా రాసేస్తారా? అని మండిపడటం తెలిసిందే. అలా.. రెండు మీడియా సంస్థలపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ మొబైల్ యాప్ డౌన్ లోడ్ గురించి.. అది పని చేసే విధానం గురించి జాకెట్ యాడ్ ను ఈనాడు పత్రికకు ఇవ్వటం గమనార్హం. అదే సమయంలో ఈనాడుతో పాటు తిట్టే ఆంధ్రజ్యోతి పత్రికకు మాత్రం ప్రకటన ఇవ్వలేదు. ఓవైపు తప్పుడు రాతలంటూ తిట్టిన ఈనాడుకు.. భారీ ప్రకటనలు ఇచ్చేందుకు ఓకే చేయటం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తిడుతూనే.. మరోవైపు భారీ ప్రకటనలు ఇవ్వటం జగన్ కే చెల్లిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News