కొత్త టెక్నాలజీని తెచ్చిన జగన్ సర్కారు.. ఏపీ ప్రజలకు వరం

Update: 2022-01-27 10:33 GMT
ప్రభుత్వఆఫీసుల్లో ఏదైనా పని పడితే ఎంత కష్టమన్న సంగతి తెలిసిందే. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవటం తరచూ కనిపిస్తుంది. అందుకే.. వీలైనంతవరకు ప్రభుత్వ ఆఫీసులతో పని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సంపన్న వర్గాలు.. ఎగువ మధ్యతరగతి.. మధ్యతరగతి వారు ఏదోలా సర్కారీ ఆఫీసులకు వెళ్లకుండా పనులు చక్కబెట్టుకునే కొన్ని మార్గాల్ని అన్వేషిస్తుంటారు.

కానీ.. సామాన్యులకు అలాంటి అవకాశమే ఉండదు. ఇక.. ప్రభుత్వ ఆఫీసుల్లో పని వేగంగా సాగాలంటే ఎవరెంత ఆఫర్ ఇస్తారన్న దాని మీదనే జరుగుతుంటుంది. ఇది బహిరంగ రహస్యమన్న సంగతి తెలిసిందే.

సిటిజన్ చార్టర్ ప్రకారం.. నిర్దేశించిన కాలంలో పనులు పూర్తి కాకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పే మాటలకు.. జరిగే పనులకుఏ మాత్రం పోలిక ఉండదు. ఎన్ని సంస్కరణల్ని చేపట్టినా.. మరెన్ని మార్గదర్శకాల్ని అమలు చేస్తున్నా.. సర్కారీ ఆఫీసుల్లో పనుల వేగాన్ని పెంచటం.. వారి సేవలు అవసరమైన ప్రజలకు బాధ్యతతో వ్యవహరించే విషయంలో వారు వెనుకబడే ఉంటున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో జగన్ సర్కారు సరికొత్త సాంకేతికతను తెర మీదకు తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఏ అధికారి వద్ద ఏ అర్జీ ఎన్ని రోజులు పెండింగ్ లో ఉందన్న విషయం ఇట్టే తెలుస్తుంది. అంతేకాదు.. ఈ విషయం సదరు ఆర్జీదారుడికికూడా అర్థమవుతుంది. ఎవరైనా అధికారి తాము పెట్టుకున్న ఆర్జీ ఏ అధికారి దగ్గర ఎన్ని రోజులు ఉందన్న విషయం తెలుస్తుంది.

 ఈ నేపథ్యంలో మాటలు చెప్పి మభ్య పెట్టే అవకాశం ఉండదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతికతను ‘సిటిజన్ సర్వీసెస్ పోర్టరల్ 2.ఓ పేరుతో రాష్ట్ర మొత్తంగా ఉన్న 15 వేల గ్రామ.. వార్డు సచివాలయాల ద్వారా 545 రకాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి.  

ఈ కొత్త సాంకేతికతను గడిచిన 20 రోజులుగా ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పుడు దీన్ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సాంకేతికతన ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో మాదిరి.. సాకులు చెప్పి.. తమ వద్ద ఫైల్ లేదనే మాట చెప్పలేరు. ఎందుకంటే.. కళ్ల ముందు ఎవరిదగ్గర ఏ ఫైలు ఉంది? ఎన్ని రోజుల నుంచి ఉందన్న విషయం అందరికి తెలిసేలా ఉన్న ఈ సాంకేతికతతో ప్రభుత్వ ఆఫీసుల్లో పనుల వేగం పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News