కాంట్రాక్టు అధ్యాపకులకు జగన్ ప్రభుత్వం షాక్.. రెండు నెలల జీతం కట్!

Update: 2022-05-27 17:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు అధ్యాపకులకు జగన్ ప్రభుత్వం తీవ్ర షాక్ ఇచ్చింది. వారికి ఏడాదికి పది నెలలు జీతం మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. మరో రెండు నెలలు జీతం ఇవ్వడం కుదరదని వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 3,618 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలుస్తోంది. రెండు నెలలు జీతం చెల్లించకపోవడం వల్ల ఒక్కో కాంట్రాక్టు లెక్చరర్ లక్ష రూపాయల చొప్పున నష్టపోతారని చెబుతున్నారు.


2022-23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 1 నుంచి పది నెలల పాటే జీతం చెల్లిస్తామని జగన్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు పింఛన్ దారులకు సకాలంలో వేతనాలు, పింఛన్లు చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ రోజుకా రోజు గడవడం కూడా ఇబ్బందిగా ఉందని ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఢిల్లీలో తిష్ట వేసి కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటున్నారని ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కాగా కాంట్రాక్టు లెక్చరర్లను అధికారంలోకి రాగానే క్రమబద్ధీకరిస్తామని.. వారికి ప్రభుత్వ లెక్చరర్లు మాదిరిగానే వేతనాలు చెల్లిస్తామని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకే ప్రజా సంకల్ప పాదయాత్రలో తనను కలసిన కాంట్రాక్టు అధ్యాపకుల సంఘానికి మాట ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తోందని.. మనందరి ప్రభుత్వం రాగానే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని నాడు జగన్ కాంట్రాక్టు లెక్చరర్లకు భరోసా ఇచ్చారు.


ఇప్పుడు రెండు నెలల వేసవి సెలవులకు రెండు నెలల జీతాన్ని మినహాయించడంపై కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం మండిపడుతోంది. వేసవి సెలవులు రెండు నెలలు తమ కుటుంబాలు ఎలా జీవించాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీ ఏమై పోయిందని జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ప్రభుత్వ అధ్యాపకుల మాదిరిగానే తమకు కూడా వేసవి సెలవుల్లో రెండు నెలల జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమతోపాటు తమ పిల్లలు, తల్లిదండ్రులు పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని తమకు రెండు నెలల జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News