ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ప్రభుత్వం షాక్!

Update: 2022-08-04 14:30 GMT
ఔట్‌సోర్సింగ్ (పొరుగు సేవ‌లు) ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింద‌ని వార్తలు వస్తున్నాయి . ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల‌కు ఆగస్టు నెల నుంచి పింఛ‌ను నిలిపేసింద‌ని పేర్కొంది. దీంతో వారంతా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని వెల్ల‌డించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు ఇప్ప‌టికే అమ్మ ఒడి, కాపు నేస్తం, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన వంటి ప‌థ‌కాల‌ను నిలిపేసింద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు తాజాగా పింఛ‌న్ల‌ను కూడా నిలిపేసింద‌ని ఒక అగ్ర ప‌త్రిక ప్ర‌ముఖంగా ఈ అంశాన్ని పేర్కొంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వివిధ ప్ర‌భుత్వ‌ శాఖల్లో 95 వేలమంది చిరుద్యోగులు పొరుగు సేవల కింద పనిచేస్తున్నారు. వీరికి ఆప్కాస్ (ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌ కార్పొరేష‌న్) ద్వారా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోంది. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్ల నుంచి సామాజిక భద్రత పింఛన్లు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదాయ ప‌రిమితి నిబంధ‌న‌ను తెచ్చి వీరంద‌రికీ పింఛ‌న్లు నిలిపేసింద‌ని చెబుతున్నారు.

ఏపీ ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారి నెల ఆదాయం రూ.10 వేలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉన్న‌వారి నెల ఆదాయం రూ.12 వేలుగా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని అంటున్నారు. ఇంతకుమించి ఉంటే అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు కోత వేస్తోంద‌ని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

గతంలో ఎవరి పింఛనైనా తొలగిస్తే అందుకు కారణాన్ని తెలుపుతూ ముందుగానే నోటీసు జారీ చేసేవార‌ని అంటున్నారు. ఈసారి మాత్రం సమాచారమివ్వకుండానే నిలిపేశార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొంతమంది 1902 నంబరుకు ఫోన్‌ చేసి ఆరా తీశార‌ని చెబుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులనే కారణంతోనే పింఛను నిలిపేసినట్లు కాల్‌సెంటర్‌ సిబ్బంది సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తమ జీతాలను స‌మ‌గ్ర ఆర్థిక నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు అనుసంధానించింద‌ని అంటున్నారు. దీంతో త‌మ‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ.. సంక్షేమ పథకాలు వర్తించవంటూ రాష్ట్ర ప్రభుత్వం కోత వేస్తోందని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తమకు వచ్చే రూ. 15,000- రూ. 18,000 వేతనంతో కుటుంబం గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు దూరమవడం త‌మ‌కు శాపంగా మారింద‌ని అంటున్నారు. తమ కారణంగా తల్లిదండ్రులు, అన్నదమ్ములు ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News