ముగ్గురు అధికారులపై జగన్ సర్కారు వేటు.. అసలు కారణం ఇదేనట

Update: 2021-08-04 10:50 GMT
అవును.. జగన్ సర్కారు జల్లెడ వేసింది. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కథనాలు అదే పనిగా వస్తుండటం తెలిసిందే. దీనికి కారణం ఏమిటి? అసలీ లీకులు ఎలా వస్తున్నాయి? ఎవరి ద్వారా సమాచారం బయటకు వెళుతోంది? ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పూస గుచ్చినట్లుగా బయటకు వెళ్లటానికి ఏమిటి? ప్రభుత్వ పరంగా తీసుకునే కీలక ఆర్థిక నిర్ణయాలపై నెగిటివ్ కథనాలు రావటం వెనుక ఉన్నదెవరు? లాంటి అంశాలపై ఫోకస్ చేసిన జగన్ ప్రభుత్వం.. అందుకు బాధ్యులుగా ముగ్గురు అధికారుల్ని తేల్చింది.

ఏపీ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖలో.. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు.. ఒక అసిస్టెంట్ సెక్రటరీని సస్పెండ్ చేయటం వెనుక చాలానే కథ నడిచిందని చెబుతున్నారు. ఏపీ ఆర్థిక శాఖ పని తీరుపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఇటీవల కాలంలో ఘాటు విమర్శలు చేశారు. తీవ్ర ఆరోపణల్ని సంధించారు. ఆదాయం భారీగా తగ్గిపోయి.. అప్పులతో బండి నడిపిస్తున్న వేళ.. ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి వివరంగా కథనాలు రావటం.. విపక్ష నేతల వరకు విషయాలు వెళ్లటాన్ని జగన్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇందులో భాగంగా ఆర్థిక శాఖకు చెందిన డి. శ్రీనిబాబు.. కె.వరప్రసాద్ లను సస్పెండ్ చేసింది. అంతేకాదు.. మరో ఆసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లుపైన కూడా ప్రభుత్వం చర్యల కత్తి ఝుళిపింది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వీడి వెళ్లకూడదన్న ప్రభుత్వ ఆదేశం జారీ చేసింది. ఆర్థిక శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని.. ఎవరి చేతుల్లో అయితే పడకూడదో వారికే అందిస్తున్నట్లుగా గుర్తించారు. అలాంటి లీకులు ప్రభుత్వానికి ఇబ్బందులుగా మారుతున్నాయన్న విషయాన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం మరిక ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవటం ద్వారా.. తప్పులు జరిగితే ఉపేక్షించన్న విషయాన్ని స్పష్టం చేసిందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News