మాట త‌ప్ప‌ని.. మ‌డ‌మ తిప్ప‌ని జ‌గ‌న్ ఆయ‌న‌కు మాట త‌ప్పేశారా ?

Update: 2021-10-31 00:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న తండ్రి దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి కూడా మాట ఇస్తే మ‌డ‌మ‌తిప్ప‌రు అన్న ఇమేజ్ ఉంది. ఇదే విష‌యాన్ని వారు ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అప్ప‌ట్లో వైఎస్ కాని.. ఇప్పుడు జ‌గ‌న్ కాని ఏ నేత‌కు అయినా మాట ఇస్తే చాలు.. ఖ‌చ్చితంగా వారికి న్యాయం చేసేవారు. ఇక జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది నేత‌ల‌కు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వారంద‌రికి న్యాయం చేశారు. ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ హామీలు ఇవ్వ‌ని వారికి సైతం కీల‌క ప‌ద‌వులు ద‌క్కాయి. అయితే ఒక్క నేత‌కు జ‌గ‌న్ ఏకంగా మంత్రి ప‌ద‌వి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ అధిష్టానం ఆయ‌న్ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అనే చెప్పాలి. ఆయన బీసీ మ‌హిళా కోటాలో విడ‌ద‌ల ర‌జ‌నీకి సీటు ఇచ్చేందుకు త‌న సీటు వ‌దులుకున్నారు. జ‌గ‌న్ పేట‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ సాక్షిగా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఎమ్మెల్సీ ఇచ్చి రాజ‌శేఖ‌ర్ అన్న‌ను మంత్రి హోదాలో త‌న ప‌క్క‌న కూర్చోపెట్టుకుంటాన‌ని చెప్పారు. ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి మూడేళ్లు అవుతోంది.. అసలు ఊరూ పేరు లేని వారికి కూడా ఎమ్మెల్సీలు ఇస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలు మారి వైసీపీలో చేరిన వారికి కూడా ప‌ద‌వులు ఇస్తున్నారు. మ‌ర్రికి మాత్రం మంత్రి ప‌ద‌వి కాదు క‌దా.. క‌నీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌లేదు. గుంటూరు జిల్లాలో బ‌ల‌మైన క‌మ్మ వ‌ర్గానికి చెందిన రాజ‌శేఖ‌ర్‌కు జ‌గ‌న్ ప‌ద‌వి ఇస్తాన‌ని ఇవ్వ‌క‌పోవ‌డంతో జిల్లాలో ఆ వ‌ర్గం వైసీపీ నేత‌ల్లో అసంతృప్తి ఉంది. మ‌రో రెండు మూడు నెల‌ల్లో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న కూడా ఉంది. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటే ముందుగానే ఎమ్మెల్సీ ఇవ్వాలి.

అయితే పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని.. దీనిపై జ‌గ‌న్ క్లారిటీతో ఉన్నార‌ని అంటున్నారు. గుంటూరు జిల్లా స్థానిక సంస్థ‌ల కోటాలో మ‌ర్రిని ఎమ్మెల్సీని చేస్తార‌ట‌. అయితే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌చ్చ‌నే అంటున్నారు. జ‌గ‌న్ మండ‌లి వద్ద‌ని.. దానిని ర‌ద్దు చేయాల‌ని అసెంబ్లీ తీర్మానం చేశారు. అందుకే మండ‌లి నుంచి మంత్రులుగా ఉన్న పిల్లి బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ల‌ను సైతం ఆయ‌న మంత్రి ప‌ద‌వుల నుంచి త‌ప్పించేసి రాజ్య‌స‌భ‌కు పంపారు. దీంతో మ‌ర్రికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తార‌ని ఆశించ‌డం అత్యాశే అంటున్నారు. మ‌రి మ‌ర్రి ల‌క్ ఎలా ఉందో ? చూడాలి.




Tags:    

Similar News