తనను కలిసిన అమరావతి రైతులకు జగన్ ఏం చెప్పారు?

Update: 2020-02-05 04:47 GMT
ఏపీలో ఏర్పాటు చేస్తామన్న మూడు రాజధానులపై అమరావతి రైతులు వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ల.. ఉండవల్లి శ్రీదేవిలు రైతుల్ని కలిశారు. వారిని తీసుకొని సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కొందరు రాజధాని రైతులతో కలిసి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల కారణంగా నష్టపోతామన్న మాట వారు చెప్పారు.

దీనికి స్పందించిన జగన్.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు తండ్రిలా ఆలోచించాల్సి ఉంటుందని.. అమరావతి అన్నది అటు విజయవాడా కాదు.. ఇటు గుంటూరు కాదని.. అమరావతి ప్రాంతంలో సరైన రోడ్లు.. డ్రైనేజీ.. పైపు లైన్లు లేవని.. కనీస మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి రూ.2కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని.. అంత భారీ ఖర్చు కష్టమని చెప్పారు.

గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి మీద ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు అయితే.. బకాయిలుగా చెల్లించాల్సిందే ఇంకా రూ.2297 కోట్లు ఉన్నాయని.. లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన చోట రూ.6వేల కోట్లు ఖర్చు చేయటమంటే సముద్రంలో నీటి బొట్టు అవుతుందన్నారు. ఈ ఖర్చులో పది శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. బాగా డెవలప్ కావటమే కాదు.. రానున్న రోజుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

విశాఖ ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్ వన్ నగరమని.. రాజధాని నగరమైతే.. మరింత బాగా డెవలప్ అవుతుందన్నారు. తాడేపల్లి.. మంగళగిరిని మోడల్ మున్సిపాల్టీలుగా చేయటానికే రూ.1100 కోట్లు ఖర్చు అవుతుందని.. ఇలాంటివి వదిలేసి ఎంత పెట్టినా కనిపించని చోట రూ.లక్ష కోట్లు పెడితే ఏం ఉపయోగం? అని ప్రశ్నించారు. తన ముందు రాజధాని రైతులు పెట్టిన అంశాల్ని నెరవేర్చటం తమ ప్రభుత్వ బాధ్యతగా చెప్పిన జగన్.. రోడ్లను డెవలప్ చేస్తే రానున్న రోజుల్లో భూముల ధరలు పెరిగిన తర్వాత వాటిని అమ్ముకోవటమో.. వ్యవసాయం చేసుకోవటమో చేస్తారని.. అదంతా వారిష్టమని చెప్పారు. తన మాటలతో అమరావతి రైతులు కన్వీన్స్ అయ్యే వాదనను సీఎం జగన్ వినిపించినట్లు చెప్పక తప్పదు.


Tags:    

Similar News