జ‌గ‌న్ పార్టీలోకి ఉండ‌వ‌ల్లి.. ఎంత‌వ‌ర‌కు నిజం?

Update: 2019-05-07 06:22 GMT
ఏపీ రాజ‌కీయం మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎవ‌రికి అనుకూలంగా వ‌స్తాయ‌న్న చ‌ర్చ ఓప‌క్క జోరుగా సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ వినిపిస్తున్న మాట ప్ర‌కారం చూస్తే.. జ‌గ‌న్ పార్టీకి ఎడ్జ్ ఉంద‌ని.. యువ‌నేత చేతికి ప‌వ‌ర్ రావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికి వేసిన అంచ‌నాలు.. జ‌రిపిన స‌ర్వేలు జ‌గ‌న్ కు గెలుపుఅవ‌కాశాలు భారీగా ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో.. ప‌వ‌ర్ చేతికి వ‌చ్చాక ఏమేం చేయాల‌న్న దానిపై పార్టీ వ్యూహ‌క‌ర్త‌లు భారీగా క‌స‌రత్తు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ విజ‌యం ఖాయ‌మ‌ని తేలిపోతున్న వేళ‌.. ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపేందుకు వీలుగా కొంద‌రిని పార్టీలో చేర్చుకోవాల‌న్న యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి వారంతా త‌న తండ్రి వైఎస్ కు అత్యంత స‌న్నిహితులుగా ఉండ‌టంతో పాటు.. స‌మ‌ర్థ‌వంతులుగా గుర్తింపు పొందిన వారిని పార్టీలో చేర్చుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకోవాల‌న్న నిర్ణ‌యానికి జ‌గ‌న్ ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. విష‌యాల మీద అవ‌గాహ‌న‌.. విష‌యం ఏదైనా స‌రే.. త‌న అభిప్రాయాన్ని సూటిగా చెప్ప‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వ పాల‌సీల‌ను బ‌లంగా వినిపించే స‌త్తా ఉన్న ఉండ‌వ‌ల్లి లాంటి వారు త‌న ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్య‌మైతే అద‌న‌పు బ‌లం యాడ్ అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా.. ఇప్ప‌టికే ఉండ‌వ‌ల్లిని పార్టీలో చేర్చుకోవ‌టానికి అనుమ‌తి ఇవ్వ‌టంతో పాటు.. ఉండ‌వ‌ల్లి వ‌ద్ద‌కు రాయ‌బారాన్ని పంపిన‌ట్లుగా చెబుతున్నారు.
 
విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న ఉండవల్లిని త‌న మంత్రివ‌ర్గంలో చేర్చుకోవ‌టానికి తాను సుముఖంగా ఉన్న‌ట్లుగా స‌మాచారాన్ని జ‌గ‌న్ పంపిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని త‌న వాగ్దాటితో చుక్క‌లు చూపించే స‌త్తా ఉండ‌వ‌ల్లికి ఉంటుంద‌ని.. రాజ్యాంగ ప‌ర‌మైన అంశాల‌తో పాటు.. పాల‌నా ప‌ర‌మైన అంశాలు కూడా ప‌ట్టున్న ఉండ‌వ‌ల్లి లాంటివారి అవ‌స‌రం ఉన్న‌ట్లుగా జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు చెబుత‌న్నారు. మ‌రి.. ఇందుకు ఉండ‌వ‌ల్లి ఏమంటారు? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News