నవ్యాంధ్ర ఓటర్లకు....జగన్ చివరి సందేశం ఇదే

Update: 2019-04-09 16:41 GMT
ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం నేటి సాయంత్రంతో ముగిసిపోయింది. ఎల్లుండి ఉదయం నుంచి పోలింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 20 రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో దాదాపుగా అన్ని పార్టీల నేతలు, ప్రత్యేకించి ఆయా పార్టీల అధినేతలు రాష్ట్రాన్ని చుట్టేశారు. ఇందులో భాగంగా విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అటు అధికార పార్టీ టీడీపీతో పాటు జనసేన, ఇతర పార్టీలపై తనదైన శైలిలో నిప్పులు చెరుగుతూ ప్రచారం చేశారు. తన బహిరంగ సభలకు పోటెత్తిన జనాన్ని చూసిన జగన్... రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానన్న మాటను గట్టిగానే చెప్పారు. దాదాపుగా 20 రోజుల పాటు అలుపెరగకుండా ప్రచారం చేసిన జగన్... ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణమే తన ప్రచారాన్ని కూడా నిలిపేసి... ప్రజలకు చివరి సందేశాన్ని పంపారు. ట్విట్టర్ వేదికగా వరుసగా నాలుగు ట్వీట్లు పోస్ట్ చేసిన జగన్... అందులో ఓటర్లకు చివరి సందేశాన్ని పంపారు. ఆ సందేశం ఆసక్తికరంగా సాగింది.

అందులో జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘తొమ్మిదేళ్ల పాటు మీరిచ్చిన మద్దతు - ప్రేమ - దేవుడి దయతోనే కొనసాగాను. తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రాతిపదిక మీరే. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ ఆశలు - అవసరాలు తెలుసుకుంటూ పాఠాలు నేర్చుకున్నా. ఈ ప్రభుత్వంపై మీకు సడలిన నమ్మకం - వంచనలు... మెరుగైన సమాజాన్ని నిర్మించాలన్న నా సంకల్పన్ని మరింత బలోపేతం చేశాయి. ఇప్పుడు సమయం వచ్చేసింది. కలిసికట్టుగా ముందుకు సాగి కొత్త పాలనకు శ్రీకారం చుడదాం. అందరికీ సంక్షేమంతో సమాజ రూపురేఖలను మార్చేద్దాం. ఏప్రిల్ 11 మీరు వేసే ఓటు నవ్యాంధ్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ఆశీస్సులు కావాలి. మీరు వివేకంతో ఓటేస్తారని భావిస్తున్నా. రేపటి భవిష్యత్తు కోసం అసంఖ్యాకంగా తరలిరావాలని అభ్యర్థిస్తున్నా. రండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి‘ అని జగన్ ఆ సందేశంలో పేర్కొన్నారు.
Tags:    

Similar News