'చంద్రబాబువి డైవర్ట్ పాలిటిక్స్'... ఉదాహరణలు చెప్పిన జగన్!

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... కూటమి 100 రోజుల పాలన, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మొదలైన అంశాలపై స్పందించారు.

Update: 2024-09-20 11:15 GMT

డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని చెబుతూ.. అందుకు కొన్ని ఉదాహరణలు తెరపైకి తెచ్చారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... కూటమి 100 రోజుల పాలన, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మొదలైన అంశాలపై స్పందించారు.

అవును... చంద్రబాబు రాజకీయం ప్రతీ అడుగులోనూ డైవర్షనే అని మొదలుపెట్టిన జగన్.. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ప్రస్తావించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలనకు వ్యతిరేకంగా తామంతా ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే.. ఆ విషయాన్ని డైవర్షన్ చేసేందుకు అదే రోజు మదనపల్లెకు ఛాపర్ పెట్టి అధికారులను పంపిస్తాడని అన్నారు.

ఇదే క్రమంలో... రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో, ట్రిపుల్ ఐటీల్లో, కాలేజీల్లోనే కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలంతా అన్యాయమైన పరిస్థితుల్లో ఉంటే.. ‘చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30ఏళ్ల సెలబ్రేషన్స్’ తో డైవర్షన్ చేస్తాడని తెలిపారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు చేసిన విషయాన్ని జగన్ ప్రస్థావించారు.

ఇందులో భాగంగా... ఆ స్కాం కేసులో అరెస్ట్ చేశారని.. తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న వ్యక్తికి సంబంధించిన మార్గదర్శి నేరాలను బయటపెట్టారని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేదిస్తుండటంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో... దాన్ని డైవర్ట్ చేయడానికి ముంబై నుంచి సైడ్ ఆర్టిస్ట్ ని అడ్డుపెట్టుకుని మరో డైవర్షన్ స్టోరీ నడుపుతున్నారని అన్నారు.

ఇక, విజయవాడలో వరదలకు సంబంధించి బుధవారం అలర్ట్ వస్తే.. అప్పుడు ఇంకా రెండు మూడు రోజుల సమయం ఉన్నా.. చంద్రబాబు రివ్యూ తీసుకోకపోవడం వల్ల 60 మంది చనిపోయారని.. ఇలా మ్యాన్ మేడ్ మిస్టేక్ గా మారిన ఈ వ్యవహారన్ని డైవర్ట్ చేసేందుకు... ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని తెలిపారు.

ఇదే సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపైనా.. కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేయాలన్న ఆలోచన మీద ఆందోళనలు జరుగుతూ ఉంటే... ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ మరో డైవర్షన్ కు తెరలేపారని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు 100 రోజుల పాలనపై దృష్టి సారించే సరికి.. తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ అని జగన్ తెలిపారు.

ఇది అత్యంత కీలకమైన డైవర్షన్ అని.. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోగలగాలి అనే ఆలోచన చేయగలిగే వ్యక్తి చంద్రబాబు అని జగన్ ఫైర్ అయ్యారు. ఒకపక్క చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజలంతా ఫైరవుతుంటే.. ‘ఏమయ్యాయి మా సూపర్ 6 లు’ అని ప్రజలు నిలదీస్తూ ఉంటే.. ఈ సమయంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి తిరుమల నెయ్యి టాపిక్ ఎత్తారని జగన్ దుయ్యబట్టారు.

తిరుమల లడ్డూలో నాసిరకం ఇంగ్రిడియెంట్స్ వాడారని.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారాని అన్నారని.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవని జగన్ ఫైరయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది స్వామివారి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని జగన్ ఈ సందర్భంగా బాబుని ప్రశ్నించారు.

వాస్తవానికి తిరుమలకు నెయ్యి కొనడం అనే ప్రక్రియ ఇప్పుడు కొత్తగా మొదలవ్వలేదని.. ప్రతీ ఆరు నెలలకూ టెండర్లు పిలుస్తారని.. అందులో ఎల్-1 గా నిలిచిన వారి కంపెనీ నెయ్యి సప్లై చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో సప్లై చేసే నెయ్యి ట్యాంకర్ తో పాటు నేషనల్ ఎక్రిడిటెషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ (ఎన్.ఏ.బీ.ఎల్.) సర్టిఫై చేసిన ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ కూడా తీసుకురావాలనేది రూల్ అని స్పష్టం చేశారు.

అనంతరం ఆ నెయ్యిని టీటీడీలో శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ పాస్ కావాల్సి ఉంటుందని.. ఇది కంపల్సరీ అండ్ రొటీన్ ప్రోసెస్ అని అన్నారు. ఆ విధంగా మూడు టెస్టులూ పాసైన తర్వాతనే ఆ నెయ్యిని ప్రసాదంలో వాడతారని జగన్ స్పష్టం చేశారు. ఒక వేళ ఈ పరీక్షల్లో పాస్ కానిపక్షంలో... నిర్మొహమాటంగా రిజక్ట్ చేస్తారని జగన్ తెలిపారు.

ఈ క్రమంలో.. 2014 - 19లో 14 నుంచి 15 సార్లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 18సార్లు ఇలా రిజక్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జూలై 12న శాంపిల్స్ తీసుకున్న్నారని.. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబే అని.. మూడు టెస్టులూ చేసిన తర్వాత జూలై 17న ఎన్.డీ.డీ.బీ.కి పంపారని.. అది రెండు నెలల క్రితం రిజక్ట్ అయితే ఇప్పటివరకూ బాబు ఏమి చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు.

Tags:    

Similar News