స్పీకర్ కోడెలకు జగన్ ఘాటు లేఖ

Update: 2017-02-27 10:16 GMT
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు వైసీపీ అధినేత జగన్ స్పీకర్ కోడెలకు ఘాటు లేఖ ఒకటి రాశారు. ఆ లేఖలో ఆయన సంధించిన ప్రశ్నలకు కోడెల ఎలాంటి సమాధానం చెబుతారా అన్న ఆసక్తి నెలకొంది. ఆ లేఖలో జగన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను దొంగ సొత్తుగా అభివర్ణించారు. అలాంటి దొంగ సొత్తును తీసుకుని కొత్త అసెంబ్లీలోకి ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు.
    
తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోవడం వల్లే అసెంబ్లీని హైదరాబాద్‌ నుంచి అమరావతికి హుటాహుటిన తరలించేశారని.. ఇక్కడ కూడా వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు వందల కోట్లు పెట్టి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ 21 మంది ఎమ్మెల్యేలు  దొంగసొత్తు కిందకే వస్తారని జగన్ చెప్పారు. కొత్త అసెంబ్లీలోకి దొంగ సొత్తు అయిన 21 మంది ఎమ్మెల్యేలను అనుమతించడం సరికాదన్నారు. ఫిరాయింపుఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము చాలాకాలంగా కోరుతున్నా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని జగన్ గుర్తుచేశారు. దొంగ సొత్తు ఎమ్మెల్యేలను కొత్త అసెంబ్లీలోకి అనుమతించడం అంటే నూతన వేదికకు కూడా మరక  అంటించడమే అవుతుందన్నారు.
    
మీరు ఎంత టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజ్యాంగంపై, ప్రజా తీర్పుపై గౌరవంతో వ్యవహరించాలని స్పీకర్ కోడెలను ఉద్దేశించి లేఖలో జగన్ వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ స్థానంలో ఉండి చర్యలు తీసుకోకపోవడం అంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.  మరి జగన్ లేఖపై స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News