టీడీపీ నేత కోసం ఇద్దరిని మార్చేస్తున్న జగన్‌..

Update: 2019-02-16 04:36 GMT
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇప్పుడు అధికార టీడీపీకే గుబులుపుట్టిస్తోంది.  2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నుంచి ఏ విధంగా టీడీపీకి వెళ్లారో.. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాయకులు టీడీపీ నుంచి వైసీపీలోకి దుంకేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి ఓటమి ఖాయమనే అంచనాలు బలపడడం.. ఆయన వ్యవహారశైలి నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నామని కొందరు చెబుతున్నా.. ఇదంతా వైసీపీ అధినేత జగన్‌ వ్యూహమేనని అంటున్నారు. ఆ వ్యూహానికి కర్తగా విజయ్‌ సాయిరెడ్డి తోడయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి..

గత ఎన్నికల్లో పరాజయం చెందిన వైసీపీ పరిస్థితి మొదట్లో దారుణంగా ఉండేది. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు పసుపు కండువా వేసుకునేందుకు క్యూ కట్టారు. అప్పుడు చేరిన వారే కొందరు ఇప్పుడు సొంతగూటికి చేరుతుండగా.. మరికొందరు టీడీపీ నాయకులు కూడా  పార్టీని వీడుతున్నారు.  కొన్ని నెలల కిందట పాదయాత్ర చేపట్టిన జగన్‌ కు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. కొద్ది కాలం  సైలెంట్‌ గా ఉన్న జగన్ ఇప్పుడు ఎన్నికల ముందర జూలు విదుల్చుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇందులో భాగంగా జగన్‌ ప్రస్తుతం ఒంగోలు - నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ ఎక్కువ నియోజకవర్గాలను గెలుచుకుంది. ప్రకాశంలోని ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. నెల్లూరులో 7 స్థానాల్లో గెలుపొందింది. అయితే ప్రకాశంలోని నలుగురు ఎమ్మెల్యేలు - నెల్లూరులోని ఒకరు టీడీపీలోకి జంపయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా ఈ జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు జగన్‌ కసరత్తు ప్రారంభించారు. ఆ పనిని విజయసాయిరెడ్డికి అప్పగించారు.

వ్యూహంలో భాగంగా ప్రకాశం జిల్లా టీడీపీపై జగన్‌ గురిపెట్టారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ ను చేర్చుకున్న జగన్‌ ఇప్పుడు మాజీ ఎంపీ - ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు. నెల్లూరుకు చెందిన మాగుంటకు సొంత జిల్లాలో లేదా ఒంగోలులో ఎంపీ టికెట్‌ ఇస్తానని వైసీపీ హామీ ఇస్తోందట..  అయితే అటు టీడీపీ కూడా మాగుంటకు నెల్లూరు ఎంపీ టికెట్‌ ఇస్తామని ప్రకటిస్తూ ఆయన పార్టీ వీడకుండా చేస్తోంది. కానీ మాగుంట మాత్రం వైసీపీపైనే మొగ్గు చూపుతున్నారు.  

నెల్లూరు ఎంపీ టికెట్‌ ను మాగుంటకు కేటాయిస్తే ఇక్కడి సిట్టింగ్‌ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని సముదాయించాలని వైసీపీ అధిష్టానం చూస్తోంది. లేదా మేకపాటికి ఒంగోలు ఎంపీ టికెట్‌ ఇచ్చేలా వైసీపీ ప్లాన్‌ వేస్తోంది. ఇదివరకు ఆయన ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. అలాగే ఇక్కడ వైసీపీకి మంచి పట్టుంది. అందువల్ల ఇక్కడి నుంచి తప్పకుండా విజయం సాధిస్తారని వైసీపీ భావిస్తోంది. కాగా గత ఎన్నికల్లో ఒంగోలులో గెలుపొందిన వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభ ద్వారా ఢిల్లీకి పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీ నాయకుడు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని చేర్చుకునేందుకు జగన్‌ ఇద్దరి స్థానాలను కూడా మార్చేందుకు రెడీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.


Tags:    

Similar News