కార్యకర్తలతో జగన్ భేటీ

Update: 2022-03-17 04:20 GMT
అధికార వైసీపీలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకున్నట్లే ఉంది. గురు, శుక్రవారాల్లో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో రెండురోజుల పూర్తి సమయాన్ని జగన్ కార్యకర్తల భేటీకే కేటాయించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ భేటీలు జరుగుతాయి. ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.

అలాగే కార్యకర్తలు కూడా పార్టీలో లోపాలు, బలాలతో పాటు తమ ప్రాంత ఎంఎల్ఏల పనితీరుపైన కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలతో ముఖాముఖి జరిపినపుడే పార్టీపై జనాల్లో ఉండే అంచనాలు, అభిప్రాయాలు తెలుస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

అందుకనే జగన్ డైరెక్టుగా కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రయినా కార్యకర్తలు, నేతలతో భేటీ అవ్వడం కష్టమే.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు నేతలు, కార్యకర్తలతో సమావేశమైనట్లు అధికారంలో ఉన్నపుడు భేటీలు సాధ్యం కాదు. ఎన్నో ప్రొటోకాల్స్, అధికారిక కార్యక్రమాలు, సెక్యూరిటీ ఆంక్షలు అడ్డు వచ్చేస్తుంది. దీంతో నేతలు, కార్యకర్తలకు సహజంగానే ముఖ్యమంత్రిపై మండుతుంది. అయితే ఈ విషయంలో ఎవరు చేయగలిగేది కూడా ఏమీ లేదు. అందుకనే ముఖ్యమంత్రికి నేతలు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ వచ్చేస్తుంటుంది.

ఇందుకనే కనీసం నెలలో ఒకరోజైనా ముఖ్యమంత్రి నేతలు, కార్యకర్తలకు సమయమిస్తే బాగుంటుందని వైసీపీలో ఎప్పటినుండో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఎలాగూ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తోంది కాబట్టి జగన్ హఠాత్తుగా రెండు రోజులు కార్యకర్తలతో భేటీని డిసైడ్ చేశారు.

మరి ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి ? కార్యకర్తలు తమ ఎంఎల్ఏలపై ఎలా రియాక్టవుతారన్నది ఆసక్తిగా మారింది. జగన్ చేసే దిశానిర్దేశానికి అనుగుణంగానే నేతలు, కార్యకర్తలంతా క్షేత్రస్ధాయిలో పనిచేయాల్సుంటుంది. బహుశా తొందరలో మొదలయ్యే జిల్లాల పర్యటనల్లో కూడా నేతలు, కార్యకర్తలకు సమయం కేటాయిస్తారేమో చూడాలి. ఏదేమైనా కార్యకర్తలతో భేటీ అవ్వటం మంచిదే కదా.
Tags:    

Similar News