మోడీతో జ‌గ‌న్ భేటీ.. కేంద్రం స్పంద‌నపై టెన్ష‌న్‌...!

Update: 2019-08-07 06:13 GMT
ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో రాజ‌కీయంగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న కీల‌క స‌మ‌యంలోనే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంతో బిజీగా ఉన్న ప్ర‌ధాని మోడీ కూడా జ‌గ‌న్‌కు అపాయింట్‌ మెంట్ ఇచ్చి.. సుమారు 45 నిమిషాల‌పాటు భేటీ అయ్యారు. బుధ‌వారం కూడా ఢిల్లీలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి, వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. ప్ర‌ధానితో జ‌గ‌న్ భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏయే అంశాల‌ను ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లి ఉంటార‌నే అనేదానిపై ఎవ‌రి విశ్లేష‌ణ వారు చేస్తున్నారు. నిజానికి.. వారిద్ద‌రి మ‌ధ్య ఏయే అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయ‌న్న‌ది మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా - జీఎస్టీ మిన‌హాయింపు - ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటులో ప‌న్నుల రాయితీ - ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు - రెవెన్యూలోటు పూడ్చేందుకు అవ‌స‌ర‌మైన నిధులు - రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి నిధుల సాయం - పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ నిధుల విడుద‌ల అంశాలను ప్ర‌ధానితో ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాట్లాడి ఉంటార‌నే ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

అయితే.. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. పై అంశాల‌కు సంబంధించి చాలా వ‌ర‌కు కేంద్రం ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాద‌ని - అది నిధుల కేటాయింపు - సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌దిత‌ర రూపాల్లోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే కేంద్రం చెప్పింది. అలాగే.. జీఎస్టీ దేశ‌వ్యాప్తంగా ఉంటుంద‌ని కాబ‌ట్టి.. దాని గురించి ఆలోచించే ప్ర‌స‌క్తే లేదని కూడా కేంద్రం చెప్పేసింది. ఇక పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలోనే కేంద్రం ఆలోచించే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయ‌డంపై కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌స్తావించి - మ‌రిన్ని నిధులు ఇవ్వాల‌ని కోరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అయితే.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో దేశ‌వ్యాప్తంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో ఎంతో బిజీగా ఉన్న ప్ర‌ధాని మోడీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ తో భేటీ కావ‌డం అత్యంత ప్రాధాన్య అంశ‌మ‌ని - ఏపీకి సంబంధించిన ప్ర‌యోజ‌నాల‌పై మోడీ సానుకూలంగా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని - అందుకే అంత బిజీ స‌మ‌యంలోనూ జ‌గ‌న్‌ తో స‌మావేశం అయ్యార‌ని ప‌లువురు రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఏదిఏమైనా.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే.. జ‌గ‌న్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి వెల్ల‌డించేదాకా ఆగాల్సిందే మ‌రి.



Tags:    

Similar News