రాష్ట్రప‌తితో వైఎస్ జ‌గ‌న్ భేటీ..బాబుపై ఫిర్యాదు

Update: 2017-04-06 10:23 GMT
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని ఢిల్లీలో కలిశారు. చంద్రబాబు నాయుడు  ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జ‌గ‌న్ ఆయ‌న‌తో స‌మావేశమ‌య్యారు.  వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు ఉన్నారు. అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి వివరించి, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయనకు కోరినట్లు చెప్పారు.

ఏపీలో విప‌క్షాల త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను బ‌ల‌వంతంగా పార్టీ మార్పించిన తెలుగుదేశం అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అనంత‌రం వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని జ‌గ‌న్‌ ఆరోపించారు. రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక వ్యవహారం నడుస్తోందని, అనర్హత పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే  ఫిరాయింపుదారుల్లో కొందరికి ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారన్నారు. అలా మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ...ఫిరాయింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలు చేసే రీతిలో చంద్ర‌బాబు నాయుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని కోర‌కుండానే త‌న కేబినెట్‌లోకి తీసుకున్నార‌ని వివ‌రించారు. రాజ్యాంగ అధిప‌తి హోదాలో ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని కోరిన‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. ఈ పరిస్థితులను నివారించకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అనైతిక వ్యవహారాలపై  అన్ని పార్టీల నేతలను కలుస్తామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

వ్యవస్థలో మార్పు రావాలని, లేకుంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో అందరినీ కలిసి మార్పుతెచ్చే ప్రయత్నం చేస్తామని వైఎస్‌ జగన్‌ అన్నారు.  ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి జరిగింది, రేపు మరో పార్టీకి ఇదే పరిస్థితి ఎదురు కావచ్చని అందరి దృష్టికి తీసుకు వెళతామన్నారు. బీజేపీని ప్రభావితం చేసే ప్రతి పార్టీ నేతను ఖచ్చితంగా కలుస్తామని జ‌గ‌న్‌ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా  ఆడియో, వీడియోల్లో దొరికిపోయారని జ‌గ‌న్ గుర్తు చేశారు.  బ్లాక్‌మనీ విచ్చలవిడిగా సంపాదించి, ఆ అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. చంద్రబాబు అవినీతిని కాగ్‌ కూడా తప్పుపట్టిందన్నారు.  ఏపీలో స‌ర్వం అవినీతిమ‌యం అయిపోయింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఇటుక నుంచి మట్టి వరకూ, మట్టి నుంచి మద్యం వరకూ, మద్యం నుంచి బొగ్గు వరకూ బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల వరకూ, కాంట్రాక్టర్ల నుంచి జెన్‌కో వరకూ జెన్‌కో నుంచి గుడి భూములు వరకూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News