పోలవరంపై జగన్ పోరు...కేంద్ర మంత్రితో కీలక భేటీ

Update: 2020-12-16 14:25 GMT
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిన సంగతి తెలిసిందే. పోలవరం డ్యామ్ నిర్మాణానికి 2014 అంచనాల ప్రకారం నిధులు చెల్లిస్తామని కేంద్రం వెల్లడించింది. పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం ఖర్చుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో, నిర్వాసితుల కోసం ఏపీ సర్కార్ పై రూ.29 వేల కోట్ల భారం పడనుంది. అంతేకాకుండా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కేంద్రం కోత విధించింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం జగన్....తాజాగా ఢిల్లీ పర్యటనలో పోలవరం నిధుల విడుదలే ప్రధాన ఎజెండాగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు సాయం చేయాలని, పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుపై పెంచిన అంచనాలను ఆమోదించాలని షెకావత్ కు జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంత నిర్వాసితుల పునరావాస ఖర్చును రీయింబర్స్ చేయాలని జగన్ కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2005-06తో పోలిస్తే 2017-18 నాటికి నిర్వాసితుల విషయంలో ఖర్చు పెరిగిందని షెకావత్ కు జగన్ వివరించారు. తరలించాల్సిన నిర్వాసితుల కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కి పెరిగిందని, అందుకే ఆర్ అండ్ ఆర్ కోసం చేయాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ. 1,779 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని, 2018 డిసెంబర్ నాటి బిల్లులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని తెలిపారు. మరోవైపు, గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఏపీకి రావాల్సిందిగా జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ ను జగన్ ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీరామ్...త్వరలోనే వీలు చూసుకొని రాష్ట్రంలో పర్యటిస్తానని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
Tags:    

Similar News